రాజధాని భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ.. ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. వాటిపై విచారణ జరిపించాలంటూ.. సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ మేరకు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ.. రాజధాని భూముల క్రయ, విక్రయాల్లో అక్రమాలు గుర్తించిందని.. దాని ప్రకారం.. కొన్ని కేసులు నమోదుచేశామని.. .ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ కేసులపై విచారణ జరపాల్సిందిగా.. సీబీఐకి సిఫార్సు చేస్తూ.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అధికారయంత్రాంగం అంతా కరోనా నివారణ చర్యల్లో ఉంది. అయితే.. అనూహ్యంగా ఏపీ సర్కార్.. కరోనాపైనే కాదు.. ప్రతిపక్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నామని తాజా జీవో ద్వారా నిరూపించినట్లయింది.
రాజధాని భూముల్లో అక్రమాలంటూ వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి విమర్శలు .. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినప్పటికీ.. ఇప్పటి వరకూ.. ఏ చర్యలూ తీసుకోలేకపోయారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని.. బినామీ ఆస్తులని చాలా ఆరోపణలు చేశారు కానీ… నిరూపించలేకపోయారు. కేబినెట్ సబ్ కమిటీ.. మొత్తం నాలుగు వేల ఎకరాలకుపైగా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నివేదిక ఇచ్చింది. అయితే.. ఈ ఎకరాలు మొత్తం… రాజధాని పరిధిలో లేనివే. వీటిపై ప్రభుత్వం సీఐడి విచారణ జరిపించింది. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించింది. వారు.. భూముల అమ్మకం దార్లు.. కొనుగోలు దారుల వారీగా.. ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. సోదాలు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులుపాటు వారు సోదాలు చేశారు కానీ.. ఏమీ తేల్చలేదు.
హఠాత్తుగా ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్రానికి సిఫార్సు చేసింది. గతంలో.. గురజాలలో అక్రమ మైనింగ్ కేసులో.. యరపతినేనిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ.. ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ఆ కేసులో ఇంకా సీబీఐ విచారణ ప్రారంభం కాలేదు. తాజాగా రాజధాని భూములపైనా విచారణ కోసం సీబీఐకి సిఫార్సు చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు కూడా.. మూడు అంశాల్లో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా మీరా కేసు.. అక్రమ నిర్బంధం కేసులో గుంటూరులో ఓ ఎస్పీ పై విచారణ.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.