అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ స్థానంలో తీసుకు వచ్చిన అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ.. పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ పైనా సవివర నివేదిక సమర్పించింది. ముఖ్యంగా కరకట్ట రోడ్డును నాలుగు లైన్ల రహదారిపై విస్తరించాలని జగన్ ఆదేశించారు.
ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా రూపొందించారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరణకు సంబంధించి రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని, సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలని సీఎం సూచించారు. అదే విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిలో పనులన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సార్లు.. సమీక్షలు చేసి.. పనులు ప్రారంభించాలని ఆదేశించినట్లుగా మీడియా ప్రకటనలు వచ్చాయి కానీ.. ఇంత వరకూ ప్రకటించలేదు. అయితే ఇప్పుడు కూడా… ఒక్క అమరావతిపైనే కాదు.. విశాఖ ప్రాజెక్టులపైనా సమీక్షించారు.
విశాఖలో గతంలో లూలుకు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడా స్థలాన్ని అభివృద్ధి చేసి అమ్మితేఎంత వస్తాయో లెక్కలు తేల్చారు. 13.59 ఎకరాల స్థలంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ, ఏపీఐఐసీ కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించవచ్చని కనీసం ప్రభుత్వానికి సుమారు రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని నివేదిక అందించాయి. అయితే.. కొద్ది రోజులుగా దాదాపుగా 1100 కోట్లతో సీఎం క్యాంపాఫీస్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై కూడా చర్చించి ఉంటారని.. కానీ వివరాలు మాత్రం చెప్పలేదని… ప్రచారం జరుగుతోంది.