” ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ సున్నా వడ్డీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు ఆ పథకాన్ని రద్దు చేసింది. రికార్డులు తెప్పిస్తా.. చంద్రబాబు రాజీనామా చేస్తారా..? ” .. అని నిండు సభలో .. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ చేసిన.. జగన్మోహన్ రెడ్డి.. అదే నోటితో ఈ రోజు.. వేరే లెక్క చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్… సున్నా వడ్డీ కోసం.. రూ. 630 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించిందని… రూ. 11600 కోట్లను చెల్లించాల్సి ఉందని.. మొత్తంగా ఐదు శాతమే చెల్లించిందని.. కవర్ చేసుకున్నారు.
సవాల్ చేయనేల.. వెనక్కు తగ్గనేల..!
ముఖ్యమంత్రి సవాల్‌ను.. సీరియస్‌గా తీసుకున్న విపక్షం… గురువారం అసెంబ్లీలో ఉన్నప్పుడే .. సున్నా వడ్డీ పథకంపై.. పూర్తి వివరాలు తెప్పించుకుంది. దాని ప్రకారం… ఐదేళ్లలో రూ. 630 కోట్ల రూపాయలు చెల్లించడం మాత్రమే కాదు.. అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్న బకాయిలను కూడా టీడీపీ సర్కార్ చెల్లించింది. ఇదే వివరాలను.. గురువారం సభ జరుగుతున్న సమయంలోనే.. తెప్పించి.. స్పీకర్ దగ్గరకు .. టీడీపీ సభ్యుడు రామానాయుడుతో పంపారు. అప్పుడే… అధికారుల నుంచి.. వైసీపీకి కూడా సమాచారం వచ్చింది. దాంతో… వెంటనే స్పీకర్ తమ్మినేని సభను వాయిదా వేశారు. అయితే టీడీపీ దీన్ని వదిలి పెట్టలేదు.
ఎట్టకేలకు ఇచ్చారని అంగీకరించిన జగన్..!
ముఖ్యమంత్రి తమపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో రగిలిపోతున్న టీడీపీ… జగన్ సవాల్‌ను తమకు అనుకూలంగా మల్చుకోవాలని డిసైడయింది. సభ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాల్సిందిచెప్పిన.. టీడీపీ సభ్యులు.. ఈ రోజు ఉదయమే… ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. సున్నా వడ్డీ, రుణాల రీ షెడ్యూల్‌పై ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారని .. పత్రాలు మొత్తం స్పీకర్‌కు పంపారు. ఆ తర్వాత దీనిపై చంద్రబాబు మాట్లాడారు. జగన్ అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేస్తారా.. క్షమాపణ చెబుతారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై.. జగన్ కూడా స్పందించారు. ఐదేళ్లో రూ. 11600 కోట్లు ఇవ్వాలని కేవలం రూ. 630 కోట్లు ఇచ్చారని.. ఇది ఐదు శాతమేనని విమర్శించారు.
జగన్ వార్నింగ్‌తో టాపిక్ ఫినిష్..!
నిజానికి సున్నా వడ్డీకి రూ. 11600 కోట్లు కట్టాలనేది.. ప్రస్తుత ప్రభుత్వం… సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్క మాత్రమే. సున్నా వడ్డీ పథకం.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో.. ప్రారంభమయింది. అప్పట్లో రూ. లక్ష వరకూ రుణాలకు వర్తింప చేశారు. టీడీపీ హయాంలో దీన్ని రూ. మూడు లక్షలకు పెంచారు. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం.. రైతులు తీసుకున్న రుణాలన్నింటికీ వడ్డీ లెక్కలు వేశారు. దీన్నే టీడీపీ వివరించే సమయంలో.. జగన్మోహన్ రెడ్డి… టీడీపీ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారని… అసెంబ్లీలో మీ బలం ఎంత.. ? మా బలం ఎంత..? అని హెచ్చరికలు దిగారు. మేం లేస్తే టీడీపీ సభ్యులు వారి స్థానాల్లో కూడా కూర్చోలేదు. మేం తల్చుకుంటే టీడీపీ సభ్యులు ఒక్క మాట కూడా మాట్లాడలేరని వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం ఏర్పడింది.