ఎవరు అవునన్నా కాదన్నా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల మనుగడకు ఉపయోగపడుతున్నాయని చెప్పకతప్పదు. వాటిని అమలుచేస్తే రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలిగేదో ఇదమిద్ధంగా చెప్పలేకపోవచ్చు కానీ, అమలుచేయకపోవడం వలన ప్రతిపక్షాలకు అవి గొప్ప ఆయుధాలుగా మారిపోయాయి. కాంగ్రెస్, వైకాపాలు వాటిని చాలా చక్కగా వినియోగించుకొంటున్నాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం ముందున్నప్పటికీ, ఆయన తొందరపాటుతనం వలన వ్రతం చెడ్డా వైకాపాకి ఫలం దక్కకుండాపోతోంది.
ఈ సమస్యలు జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు వచ్చినప్పుడే అవి ప్రజల సమస్యగా అభివర్ణిస్తుంటారు లేకుంటే లేదు. సుమారు ఏడాది కాలంపాటు ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. అకస్మాత్తుగా ఒకరోజు దానికోసం పోరాడాలని ఆయనకి బుద్ధి పుట్టింది. అంతే! లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా డిల్లీకి ప్రత్యేక రైలు కట్టుకొని వెళ్లి దీక్ష చేసేసి, తిరిగి రాగానే రాష్ట్ర బంద్, ఆ తరువాత గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చకచకా చేసేసారు. ఆ తరువాత మళ్ళీ ఆ ఊసు ఎత్తితే ఒట్టు! ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా మోదట ఎందుకు ఇష్టపడలేదో, ఆ తరువాత అకస్మాత్తుగా దాని కోసం ఎందుకు దీక్ష చేసారో, మళ్ళీ ఆ తరువాత దాని ఊసు ఎందుకు ఎత్తలేదో ఆయనకే తెలియాలి. కానీ ప్రజల మనోభావాలతో ముడిపడున్న సున్నితమయిన ఈ అంశాన్ని ఆయన హ్యాండిల్ చేసిన విధానం చూస్తే దానిపై ఆయనకి చిత్తశుద్ధి లేదని స్పష్టం అయ్యింది.
మళ్ళీ మొన్న రైల్వే జోన్ కోసం విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఆయన దీక్ష భగ్నం అయితే జగన్మోహన్ రెడ్డి దానిని కొనసాగిస్తారని ప్రకటించిన తరువాత మళ్ళీ వెనక్కి తగ్గడం, జగన్ స్వయంగా అమర్నాథ్ చేత నిరాహార దీక్ష విరమింపజేసి తమ పోరాటం కొనసాగుతుందని ఓ ప్రకటన చేసి వెళ్లిపోవడంతో దానిని కూడా అలాగే చూడవలసివలసి వస్తోంది. మళ్ళీ ఆయనకు ఎప్పుడు ఏది గుర్తుకు వస్తే అప్పుడు దానిపై ఉద్యమిస్తారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ రెంటిపై పోరాటాలు అయిపోయినట్లే భావిస్తే తరువాత పోలవరాన్ని అందుకొంటారేమో? ఏమో?