రాజకీయ నేతలపై అభిమానం చూపించడం రకరకాలుగా ఉంటుంది. ఆ అభిమానానికి ప్రాంతాల హద్దులు కూడా ఉండవు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు వందల మంది గుండెపోటుతో చనిపోయారని చెప్పుకున్నారు. దీనికి విపక్షాలు.. సొంత కుటుంబంలో ఎవరికీ జ్వరం కూడా రాలేదు.. ఆయన అభిమానులకు ప్రాణాలు పోతాయా అని సెటైర్లు వేశారు అది వేరే విషయం . ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యువ నేతలకు అలాంటి అభిమానాలే కనిపిస్తూ ఉంటాయి. గతంలో సంగారెడ్డి నుంచి ఓ జగన్ ఫ్యాన్ పాదయాత్ర చేస్తూ తాడేపల్లి వచ్చిన విషయం హైలెట్ అయింది.
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు జగనన్న అద్భుతంగా పరిపాలిస్తున్నారంటూ పాదయాత్ర చేస్తూ తాడేపల్లికి వచ్చారు. సాక్షి మీడియాలోనూ గొప్పగా రాశారు. ఆయనను జగన్ కలిశారో లేదో స్పష్టత లేదు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి కేటీఆర్ కోసం ఓ యువకుడు నడుస్తున్నారు. మంత్రి కేటీఆర్.. చేసిన .. చేస్తున్న సేవలకు శ్రీకాకుళం యువకుడు కూడా ఫిదా అయ్యాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం మండలం సారథి గ్రామానికి చెందిన శేఖర్ కు మంత్రి కేటీఆర్ అంటే మీ అభిమానం. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు వందనాలు… అనే ఫ్లెక్సీ తో నవంబర్ 30వ తేదీన తన గ్రామం నుంచి కాలినడకన బయలు దేరాడు శేఖర్.
తెలంగాణలోకి చేరుకున్నారు. ఆయనకు టీఆర్ఎస్ అనుకూల మీడియా కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తోంది. అసలు రాష్ట్రం కాని రాష్ట్రాల్లో ఉన్నారు. ఆయా ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందవు. అయినా వారు అభిమానం పెంచుకుని నడుస్తూ పోతున్నారు. వారికి కాస్త ప్రచారం కూడా వస్తోంది., ఎవరి కోసం నడుస్తున్నారనో… వారి గొప్పతనం కూడా హైలెట్ అవుతోంది. మొత్తంగా రాజకీయ నేతలకు అభిమానులు.. ఎక్కువైపోతున్నారు… ప్రాణాలు పోగొట్టుకునేవారే కాదు.. అలుపు లేకుండా పాదయాత్రలు చేసేవారు కూడా ..!