త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ప్రతిపక్ష నేత జగన్ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులు కూడా ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అయితే, ఈ తరుణంలో ‘యువభేరి’ అంటూ జగన్ మళ్లీ జగన్ ప్రకటించడం విశేషం! ప్రత్యేక హోదా సాధన కోసమే యువభేరీ సభల్ని వైకాపా గతంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖ, కర్నూలు వంటి ప్రాంతాల్లో యువభేరి నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమనీ, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా ప్రత్యేక హోదాతో మాత్రమే సాధ్యం అనే విషయాన్ని యువతకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ సభలు నిర్వహించారు. ఆ తరువాత, వాటిని కొనసాగించలేదు. కొంత విరామం తరువాత, ఈ నెల 10న అనంతపురం జిల్లాలో యువభేరి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు పార్టీ ప్రకటించడం విశేషం.
అయితే, ఏపీకి హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో ఆ వేడి కాస్త తగ్గిందనే చెప్పాలి! పైగా, వచ్చిన ప్యాకేజీ కూడా హోదాకు మించింది అంటూ అధికార పార్టీ కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో యువభేరి కార్యక్రమాలను వైకాపా కూడా నిర్వహించలేదు. ఆ తరువాత, నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. కనీసం ఆ ఎన్నికలో కూడా ప్రత్యేక హోదాను ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేయలేదు! నంద్యాల ఎన్నికలు సెమీ ఫైనల్స్ అంటూ భారీ ఎత్తున ప్రచారానికి వెళ్లి.. చివరికి భంగపడ్డారు! ఇప్పుడు మళ్లీ యువభేరి సభల్ని వరుసగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం! ప్రత్యేక హోదా ఉద్యమంలో యువతను మమేకం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సభలు పెట్టాలని మళ్లీ అనుకుంటున్నారు.
హోదా ఇవ్వకపోతే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తారని అప్పట్లో జగన్ ప్రకటించేశారు. ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. కానీ, అవన్నీ మాటలకు మాత్రమే పరిమితం అయ్యాయి! తమకు ఖాళీ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడీ, ఆ తరువాత దాన్ని పట్టించుకోని విధంగా ఇన్నాళ్లూ ఈ అంశాన్ని వైకాపా డీల్ చేసుకుంటూ వచ్చింది. ఇందులో ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుందనేది అసలు ప్రశ్న..? మళ్లీ ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదాపై ఉద్యమించాలీ అంటే, అది సాధ్యమయ్యేదా..? కేవలం యువతను కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ వేదికగా మాత్రమే ఈ యువభేరి కార్యక్రమాలు వైకాపాకి పనికొస్తాయి. అంతేగానీ, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రభావం ఇకపై వీటికి ఉండదనేదే విశ్లేషకుల అంచనా.
ఇంకోపక్క, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా అంటూ ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు కదా! ఈ నేపథ్యంలో తాము కూడా ఉద్యమిస్తున్నాం, తాము కూడా అదే సమస్యపై పోరాడుతున్నాం అని చెప్పుకోవడమే వైకాపా ఉద్దేశంగా కనిపిస్తోంది. మరో నెలలో ఎలాగూ పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఎలాగూ ఆ యాత్రలో చాలా అంశాలపై తెలుగుదేశం పార్టీని విమర్శించేందుకు అజెండా సిద్ధం చేసుకుని ఉంటారు. దాన్లో ప్రత్యేక హోదా కూడా ఉంటుంది కదా! అలాంటప్పుడు, దాన్నొక్కదాన్నే ప్రత్యేకంగా చూస్తూ, మళ్లీ వేరేగా ఉద్యమిస్తున్నాం అనడం వెనక వైకాపా ఉద్దేశం ఏంటో మరి!