జగన్ మోహన్ రెడ్డి కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పించేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఆయన లండన్ పర్యటనను సైతం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కోర్టు ఇరవై ఐదో తేదీ వరకు పర్మిషన్ ఇచ్చింది. కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం ఆయన పర్మిషన్ అడిగారు. ఆ పుట్టిన రోజు కూడా అయిపోయింది. ఇక లండన్ వెళ్లాల్సిన అవసరం ఏముందిలే అని ఆయన అనుకుంటున్నారు. అందుకే పూచికత్తు సమర్పించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది.
న్యాయవ్యవస్థను ఎంతగా కించ పరచాలో జగన్ అంతగా కించ పరుస్తున్నారు. సీఎంగా ఉండి కాబోయే భారత చీఫ్ జస్టిస్ మీదనే తప్పుడు ఆరోపణలు చేసి న్యాయవ్యవస్థను ఎంతగా కించ పరచాలో అంత కించ పరిచారు. తనపై ఉన్న కేసుల విషయంలో కోర్టులకు హాజరు కావడంలేదు. కనీసం తాను పెట్టిన కేసుల్లో సాక్ష్యం చెప్పేందుకు వెళ్లడం లేదు. బెయిల్, పాస్ పోర్టు పూచికత్తులు సమర్పించేందుకూ వెనుకాడుతున్నారు. ఆయన తీరును పీపీ లక్మినారాయణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు వెళ్లడాన్ని ఆయన నామోషీగా భావిస్తున్నారని చెప్పారు. అందుకే కోర్టు ఆయనే స్వయంగా పూచికత్తులు సమర్పించే విషయంలో ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
జగన్ ఈగో ఏమో కానీ.. ఆయన న్యాయవ్యవస్థతో పంతానికి పోతే.. ఎవరికి నష్టమో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆకు వెళ్లి ముల్లు మీద పడినా.. ముల్లు వచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే. ఆ విషయాన్ని జగన్ రెడ్డికి ఆయన సలహాదారులు పక్కాగా చెప్పకపోతే … కష్టమేనని క్యాడర్ కూడా భావిస్తున్నారు. కానీ జగన్ కు ఎవరైనా చెప్పినా.. ఆయన వింటాడన్న నమ్మకం వారికి కూడా లేదు మరి !