గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బొత్స సత్యనారాయణను… హడావుడిగా వైసీపీ పెద్దలు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాక్రమాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా నటిస్తున్నారు. టిక్కెట్లు ఎగ్గొడుతున్న లిస్టులను బొత్సతోనే ప్రకటింప చేస్తున్నారు. సమ్మెలు చేస్తున్న ఉద్యోగులతో చర్చలకూ ఆయననే ముందు పెడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.
బొత్స సత్యనారాయణకు జగన్ రెడ్డి గట్టి గా ఎర్త్ పెట్టబోతున్నారని ఆయనను రాజకీయాల నుంచి తప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. చీపురుపల్లిలో ఈ సారి ఆయనకు టిక్కెట్ లేదని ఇప్పటికే ప్రచారాన్ని ఆన్ లో పెట్టారు. అందుకు ప్రతిఫలంగా ఆయన భార్యకు విశాఖ ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేస్తున్నట్లుగా లీకులు ఇచ్చారు. అసలు దీనిపై తనతో మాట్లాడలేదని బొత్స ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇస్తే విజయనగరం ఇవ్వొచ్చు కదా.. విశాఖ ఎందుకన్నది ఎవరికైనా వచ్చే డౌట్. వైసీపీలో అలాంటి వాటికి ఆన్సర్లు రావు. ఎందుకంటే… ఆక్కడ మోకాలు రుద్దుకున్నప్పుడు పుట్టే ఆలోచనలన్నింటినీ అమలు చేస్తున్నారు.
రాజ్యసభ పేరు చెప్పి లేదా.. మరో కారణం చెప్పి బొత్సను రాజకీయంగా రిటైర్ చేయించాలని.. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ నిర్వహణలో ఆయన కీలకంగా ఉంటారని నమ్మించేందుకు ప్రస్తుతం ఆయనను అన్ని విషయాల్లో ముందు పెడుతున్నారని చెబుతున్నారు. వైసీపీలో జరిగే పరిణామాలపై బొత్సకూ అవగాహన ఉంది. కానీ ఆయనకు బయటకు పోయే మార్గం కనిపించడం లేదు. ఆయనలో అసంతృప్తి మాత్రం పేరుకుపోతుదని.. తమ రాజకీయ సామ్రాజ్యాన్ని జగన్ రెడ్డి నరికేసే ప్రయత్నం చేస్తున్నా… ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో పడిపోయారని అంటున్నారు.