భారతీయ జనతా పార్టీ నేతలు ఇటీవలి కాలంలో.. వైసీపీపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రత్యేకహోదా ప్రస్తావన తీసుకు రావడం మాత్రమే కాదు.. టీడీపీ నేతలు.. బీజేపీలోకి వలసపోకుండా.. జగన్మోహన్ రెడ్డే అడ్డం పడుతున్నారట. మాజీ నేతలు ఎంత మంది చేరినా ఎఫెక్ట్ రాదు. కానీ.. పదవిలో ఉన్న వారు చేరితే… కొంత బలం వస్తుందని… బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కొంత మంది అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతున్నా… జగన్మోహన్ రెడ్డి.. తక్షణం అనర్హతా వేటు వేయిస్తారన్న భయంతో ఆగిపోతున్నారట. అందుకే.. బీజేపీ నేతలు.. రగిలిపోతున్నారంటున్నారు.
ఏపీలో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేకపోయిన బీజేపీ… తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి.. ఆ పార్టీ స్థానాన్ని అందుకోవాలని.. ఓ భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా.. టీడీపీకి ఆర్థికంగా పిల్లర్స్‌లా వ్యవహరించిన నేతల్ని.. ముందుగా… పార్టీలో చేర్చేసుకుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. వారు … ప్రజా జీవితంలో లేరు కానీ.. టీడీపీ అనుపానులు మొత్తం తెలిసినవారు. పార్టీ క్యాడర్‌తో కింది స్థాయి నుంచి పరిచయం ఉన్నవారు. వారు తల్చుకుంటే.. పార్టీ క్యాడర్ ను.. పార్టీలోకి తేగలరని బీజేపీ నేతలు నమ్మారు. దానికి తగ్గట్లుగానే వారు ప్రయత్నాలు చేశారు. కానీ ఏపీలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి అడ్డం పడుతున్నారు.
ఏపీలో ఎవరు పార్టీ ఫిరాయించినా అనర్హతా వేటు ఖాయమని.. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను తాను బాగు చేస్తానని పదే పదే చెబుతున్నారు. అంత పెద్ద ఆదర్శాలు చెప్పడమే కాదు.. ఎన్నికలకు ముందు… కొంత మంది చేత రాజీనామాలు చేయించిన చరిత్ర కూడా ఉంది. ఈ ట్రాక్ రికార్డును ఆయన కొనసాగించాలనుకుంటున్నారు. అది తన పార్టీలో చేరితే మాత్రమే కాదు.. ఎవరిపైనైనా ఫిరాయింపుల ఫిర్యాదు వస్తే వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పీకర్‌కు కూడా చెబుతున్నారు. ఈ కారణాలతో.. బీజేపీలో చేరాలనుకునే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెనుకడుగు వేస్తున్నారట. టచ్‌లో ఉంటాం కానీ.. పార్టీలోకి ఇప్పుడల్లా రాలేమని చెబుతున్నారట.
ఈ విషయమే.. జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేతల ఆగ్రహానికి మరో కారణం అని.. చెబుతున్నారు. ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్లు .. దీన్ని డైరక్ట్ గానే చెబుతున్నారు. అనర్హతా వేటు భయంతోనే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలో చేరడం లేదని చెప్పుకొస్తున్నారు. జగన్ పాటిస్తున్న రాజకీయ విలువలు… మొత్తానికి.. బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. బీజేపీ బలపడకూడదనే.. జగన్మోహన్ రెడ్డి.. ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం కూడా.. ఆ పార్టీలో ఉంది.