ప్రజల్ని కలిసేందుకు ప్రజాదర్భార్‌ను సీఎం జగన్ బుధవారం నుంచి ప్రారంభించాల్సి ఉంది . అదే సమయంలో నియోజకవర్గాల నుంచి యాభై మంది కార్యకర్తలతోనూ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి క్షణంలో ప్రజల్ని కలవడానికి జగన్ ఆసక్తిచూపించలేదు. దీంతో ప్రజాదర్బార్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎప్పటి నుండి ప్రారంభిస్తారన్నదానిపై స్పష్టత లేదు. కానీ కార్యకర్తలతో మాత్రం భేటీలు కొనసాగుతాయి. తొలి సారిగా కుప్పం కు చెందిన యాభై మంది నేతలతో భేటీ అవుతున్నారు.
అయితే ఈ దర్బార్ వాయిదాలు ఇప్పుడు కాదు గత మూడేళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి. సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే ప్రజాదర్బార్‌ను జగన్ ప్రకటించారు. ఓ రోజు జనం అంతా పోలోమని ఆయన ఇంటికి వచ్చారు. కానీ వాయిదా వేసుకున్నారు. అప్పట్నుంచి వాయిదాలు పుడుతూనే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాదర్బార్‌ను నిర్వహిచేవారు. ప్రతీ రోజూ.. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొనేవారు. రాజన్న పాలనలో జగన్ అలానే చేస్తారని చెప్పారు. కానీ మూడున్నరేళ్ల నుంచి మాత్రం చేయడం లేదు.
పార్టీ కార్యకర్తలకు మాత్రం జగన్ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఆయన బిజీ అయ్యే చాన్స్ లేదు. ప్రజల కన్నా పార్టీకార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నారు. ఎన్నికల సన్నాహాల్లో ఉన్న జగన్‌కు పార్టీ క్యాడర్ ముఖ్యమనుకుంటున్నారు. నిజానికి గతమూడున్నరేళ్లుగా జగన్ పార్టీ క్యాడర్‌ను కూడా కలవలేదు.