థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగు చెప్పి .. థర్టీ ఇయర్స్ ఫృధ్వీగా పాపులర్ అయ్యారు ఒకరు. వైసీపీ పుణ్యాన ఆయన రాజకీయంగా హైలెట్ అయ్యాడు. వైసీపీలోనే బలి చేయడంతో బయటకు వచ్చి ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీలోనూ ఓ థర్టీ ఇయర్స్ పెద్దాయన బయలుదేరాడు. ఆయన పేరు జగన్. మాట్లాడితే ఇంకా థర్టీ ఇయర్స్ రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొస్తున్నారు. ఎవరికో కాదు.. సొంత పార్టీ నేతలకే.
ప్రతి సమావేశంలో థర్టీ ఇయర్స్ డైలాగ్ చెబుతున్న జగన్
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కావొచ్చు.. ఇతర నేతలతో కావొచ్చు.. లేకపోతే పార్టీ కార్యకర్తలు కావొచ్చు..ఎవరు వచ్చినా జగన్ రెడ్డి ముందు థర్టీ ఇయర్స్ రాజకీయాల్లో ఉంటానని చెబుతున్నారు. ముందుగా ఆయన మళ్లీ వస్తా.. ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటాననేవారు. అది మరీ స్టాండప్ కామెడీ జోక్ లా ఉందని.. సీఎంగా ఉంటానని చెప్పడం కన్నా..రాజకీయాల్లో ఉంటానని చెప్పడం మంచిదని సలహాలు వచ్చాయేమో కానీ.. ఆ మాదిరిగా మార్చారు.
పార్టీ ఉంటుందని చెప్పడమే జగన్ ఉద్దేశం
పార్టీ భవిష్యత్ పై ఎలాంటి ఢోకా లేదని… తనను జైలుకు పంపబోరని..తాను బయటే ఉంటానని చెప్పుకుని పార్టీ నేతల్ని కాపాడుకోవడమే జగన్ ఈ థర్టీ ఇయర్స్ మాటల వెనుక ఉద్దేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో జగన్ జైలుకెళ్లినప్పుడు .. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఉన్నారు. ఇద్దరూ కలిసి పార్టీ ని లాక్కొచ్చారు. కానీ ఇప్పుడు జైలుకెళ్తే ఉండేది.. సజ్జల రామకృష్ణారెడ్డి.. నా భర్తను జైల్లో పెట్టారని ఏడ్చుకుంటూ వైఎస్ భారతి ప్రజల్లోకి వచ్చినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఆమె ఇమేజ్ మసకబారింది. పైగా కుటుంబంలో ఇతరులు అంత కంటే ఎక్కువ అగ్రెసివ్ గా వ్యతిరేకంగా బరిలోకి వస్తారు. అందుకే తాను ఎక్కడికీ పోనని .. ముఫ్పై ఏళ్లు ఉంటానని చెప్పుకొచ్చారు.
పార్టీ భవిష్యత్ పై కింది స్థాయి వరకూ సందేహాలు
వైసీపీ పార్టీ భవిష్యత్ పై కింది స్థాయి వరకూ సందేహాలు ఉన్నాయి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. భవిష్యత్ లో వచ్చే ముప్పును జగన్ ముందుగానే గుర్తించారని అనుకున్నారు. రాబోయే రోజుల్లో జగన్ పార్టీలో చాలా జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే థర్టీ ఇయర్స్.. 2.O, సప్త సముద్రాలు వంటి డైలాగులు కొట్టి నమ్మకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయాల్లో కావాల్సింది డైలాగులు కాదు.. అంతకు మించి !