అమరావతిలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపి అద్యక్షుడు జగన్ నిర్వహించిన మీడియా గోష్టి ఆయన ధోరణిలో మెరుగుదలను చూపించింది. ఉద్రిక్తత, వివాదం మేళవించిన అంశాలపై ఓపిగ్గానే సమాధానాలు ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం బాగానే చేశారు. దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం తర్వాత నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన రభసలో తన పాత్ర ఏమిటో అధికారులు ఏం చేశారో వివరించారు. కలెక్టర్‌తో సహా అందరినీ జైలుకు పంపించే కార్యక్రమం గురించి జగన్ మాట్లాడ్డం పొరబాటే గాని మిగిలినదాంట్లో తప్పేమీ లేదు. నిజానికి స్థానికంగానూ రాష్ట్రస్తాయిలోనూ టిడిపినే చొరవ తీసుకుని వుంటే ప్రతిపక్షానికి ఆ అవకాశం కూడా వచ్చి వుండేది కాదు. తర్వాత కూడా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, చర్యల గురించి గాక జగన్ మాటలపైనే రాద్ధాంతం నడుస్తున్నది.ఈ నేపథ్యంలో జగన్ పూర్వాపరాలు వివరంగా చెప్పడం వల్ల స్ఫష్టతకు అవకాశమేర్పడింది. ఈ సమావేశంలోనే ఒక విలేకరి జగన్ జైలుకు వెళ్లడం గురించి ప్రస్తావించగా ఏమాత్రం తడుముకోకుండా అంత అపహాస్యం వద్దని బదులిచ్చారు. జైలుకు వెళ్లివచ్చిన వారికి అ అనుభవం ఎంత దారుణంగా వుంటుందో తెలుస్తందని కూడా వ్యాఖ్యానించారు.ఈ ప్రశ్నను అవకాశంగా తీసుకుని జగన్ తనపై కేసులు రాజకీయ ప్రేరితమైనవని మరోసారి వాదించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఎంత తాపత్రయ పడ్డారో కూడా ప్రస్తావించారు. మొత్తంపైన ప్రశ్నలకు జవాబులు దాటేయడం గాక తను అనుకున్నది చెప్పడంలోస్పష్టత కనిపించింది. ఓటుకు నోటుపైన కూడా గట్టిగానే స్పందించారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన మీడియా గోష్టి కేవలం గొప్పల కుప్పగానే ముగిసింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం, ఆయనకు నోటీసు పంపడం జరిగినా ఏం ఫర్వాలేదని జవాబిచ్చారు. 26 కేసులు వేసుకున్నా ఏం కాలేదని భరోసా ప్రదర్శించారు. ఇంతకూ ఆ కేసులేమిటో వివరాలు ఏమిటె ఎవరికీ తెలియదు. వూకదంపుడుగా చెబుతుంటారు. తొలిరోజు జరిగిన మీడియా గోష్టులు చూస్తే మాత్రం జగన్ తన శైలిని మార్చుకుంటున్నట్టు కినిపిస్తుంది. అది మంచిది కూడా.