పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతూంటారు. 70 శాతం పూర్తి అయిందని.. చంద్రబాబు .. చాలా కథలు చెప్పారు కానీ… జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా పునాదులు దాటలేదని… ఎప్పుడో స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో.. ఆయన ఆలోచనలేమిటో.. ఢిల్లీలో మీడియాతో మొదటి సారి పంచుకున్నారు. దాని ప్రకారం.. ఆయన మొదటగా.. పోలవరం కాంట్రాక్టులపైనే సమీక్ష చేయబోతున్నారు.
పోలవరం నిర్మాణం కొనసాగించాల్సిన అవసరం ఏపీకి లేదా..?
పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగించాల్సిన అవసరం లేదని.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీడియాకు స్పష్టం చేశారు. అయితే.. ప్రాజెక్టు మాత్రం.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ రెండు మాటలు పరస్పర విరుద్ధమైనవిగా కనిపిస్తున్నప్పటికీ… ఇందులో ఓ లాజిక్ ఉంది. అదేమిటంటే… కేంద్రం.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. అయితే.. కేంద్రం నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే.. దశాబ్దాల పాటు సాగుతుందన్న ఉద్దేశంతో.. శరవేగంగా పూర్తి చేయడానికి.. ఏపీ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. దాని ప్రకారం.. పోలవరం అధారిటీ ఏర్పాటయింది. ఆ అథారిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. ఏపీ ముందుగా డబ్బులు ఖర్చు పెడుతుంది. బిల్లులు పెడితే.. కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. అంటే… ఏపీదే మొదటి బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి.. ఆ పనులు కొనసాగించాల్సిన అవసరం లేదని.. స్పష్టత ఇచ్చారు. బహుశా ఆయన ఏపీకేమీ సంబంధం లేదని కేంద్రామే చూడాలని చెప్పే అవకాశం ఉంది.
కేంద్రంపై భారం వేస్తే వెనుకబడిపోదా..?
అదే సమయంలో… పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైనా… జగన్ దృష్టి పెట్టారు. మొదట ఈ ప్రాజెక్టు … రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి వచ్చింది. ఆ కంపెనీ పనులు చేయలేక చేతులు ఎత్తేసింది. పనులు ఆగకూడదన్న ఉద్దేశంతో.. చంద్రబాబు… నవయుగ కంపెనీకి.. పాత ధరలతోనే… పనులు చేయించేందుకు అంగీకరించారు. ఇప్పుడా పనులు నవయుగ చేస్తోంది. కానీ.. జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నారు. అందుకే.. కాంట్రాక్టులపై పూర్తి వివరాలు సేకరించి… కాంట్రాక్టులను రద్దు చేసి.. కొత్త వారికి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే కాంట్రాక్టులు ఇస్తామని చెబుతున్నారు. అదే.. అప్పుడు ఉన్న ధరలకు ఇప్పుడు కాంట్రాక్టర్లకు ముందుకు రావడం అసాధ్యమే. మరి జగన్ ఏం చేయబోతున్నారో..?
పోలవరం పూర్తి చేస్తేనే ఏపీ రైతులకు భరోసా..!
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో… ఒక్క సారి ఆలస్యం జరిగితే.. అంచనాలు.. పెరిగిపోతాయి. కొత్త కాంట్రాక్టర్ వచ్చి.. మొత్తం చూసుకుని పనులు ప్రారంభించేసరికి.. పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలి కానీ.. ప్రాజెక్టు నిర్మాణంపై.. ఎలాంటి ప్రభావం పడకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్టు దశాబ్దాల కల. ఆ ప్రాజెక్టు పూర్తయితే… కరువు అనేది ఉండదని… ప్రజలు, రైతుల నమ్మకం. దాన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తే.. ఏపీకి అంత లాభం. లేకపోతే.. నష్టమే..!