ఎన్నికల ప్రచారం చివరి రోజున రాజధాని ప్రాంతం మంగళగిరిలో పర్యటించారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంగళగిరిలో ఓటుకు రూ. 10 వేలు పంచి కొనుగోలు చేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని తనకు తెలుస్తోందన్నారు. వారి కుట్రలకు మోసపోవద్దనీ, ఇచ్చే డబ్బులకు ఆశపడొద్దనీ, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే అన్నీ ఇస్తాడని మరోసారి జగన్ చెప్పుకున్నారు. మంగళగిరి ప్రాంతంలో రైతుల భూములను కాపాడాలంటే ఆర్.కె.ని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. టీడీపీ అభ్యర్థి గడచిన ఐదేళ్లలో ఈ నేలమీద కాలు కూడా పెట్టలేదన్నారు. ఇదే మంగళగిరిలో ఎన్నో కుంభకోణాలు జరిగాయనీ, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కూడా ఇక్కడే అని విమర్శించారు. ఆర్కేకి ఓటు వేస్తే నా కేబినెట్ లో మంత్రిగా ఉంటాడని హామీ ఇస్తున్నా అన్నారు జగన్.
ప్రజలకు ఫలానాది చేస్తా అంటూ హామీలు ఇవ్వడం వరకూ ఓకే, కానీ మంత్రి పదవులను కూడా ఎన్నికల హామీలుగా జగన్ ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మీద ఆర్కే గెలిస్తే ఆయనకి మంత్రి పదవి. సీఎం చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో చంద్రమౌళీ గెలిస్తే… ఆయనకీ మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. మండపేట నుంచి పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గెలిస్తే ఆయనకీ మంత్రి పదవి హామీ ఇచ్చారు. చిలకలూరి పేటలో సీటు దక్కలేదని అసంత్రుప్తికి గురైన మర్రి రాజశేఖర్ ని కూడా మంత్రి చేస్తామన్నారు. ఇలా దాదాపు అరడజను మంత్రి పదవుల్ని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించేసినట్టే. ఇక, ఎమ్మెల్సీ పదవుల హామీలు చెప్పనక్కర్లేదు.
తనని తాను మానసికంగా ముఖ్యమంత్రి పదవిలో ఎప్పుడో కూర్చోబెట్టేసుకున్నారు జగన్. కేబినెట్ లో ఎవరుండాలో అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే, మంత్రి పదవుల్ని హామీలుగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈయనే మంత్రి పదవులు హామీలు ఇస్తున్నప్పుడు… ఎన్నికలు జరగకముందే గెలిచిపోయామన్న ధీమాతో వైకాపా కేడర్ లో ఎందుకు ఉండదు..? కానీ, గెలిచిపోయామన్న ధీమాతో ఉండొద్దంటూ ఇతర నేతలు కేడర్ కి క్లాసులు తీసుకుంటున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. మంత్రులుగానీ, ఎమ్మెల్సీలనుగానీ ఏ పార్టీలో అయినా… గెలుపు ధీమా ఎంత ఉన్నా కూడా ఎన్నికల తరువాతే వాటి ప్రస్థావన ఉంటుంది. కానీ, జగన్ మాత్రం ఇప్పుడు కేబినెట్ విస్తరణ దాకా వెళ్లిపోయారు.