టాలీవుడ్ పెద్దలు ఏపీలో తాము కోల్పోయిన ప్రివిలేజెస్ మొత్తాన్ని సీఎం జగన్ నుంచి ఎలాగోలా పొందేలా హామీ తెచ్చుకున్నారు. సినీ ప్రముఖులతో సీఎం జగన్ ఏం మాట్లాడారో ప్రభుత్వ పీఆర్వో సాయంత్రం వీడియో విడుదల చేశారు. మధ్యమధ్యలో ఏంమాట్లాడారో కానీ కొన్ని కట్స్ ఉన్నా.. బయటకు చెప్పాలనుకున్నది మాత్రం స్పష్టంగానే వీడియోలో ఉంది. దాని ప్రకారం టాలీవుడ్ నుంచి లాక్కున్న అన్ని పాత ప్రివిలేజెస్‌ను ఇస్తున్నట్లుగా జగన్ తెలిపారు. అయితే గతంలో ఇవన్నీ ఉన్నాయని.. తాము జీవో రద్దు చేశామని.. మళ్లీ ఇస్తున్నామన్న భావన రాకుండా సినీ పరిశ్రమను నిలబెట్టేందుకు తాను ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ అదే అసలు ట్విస్ట్.
పెద్ద సినిమాలకు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. టిక్కెట్ రేట్ల పెంపును ఇప్పటి వరకూ ప్రభుత్వం దోపిడీగా చెబుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెబుతోంది. హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారని.. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలని జగన్ అన్నారు. లేకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకు రాన్నారు. అందుకే అలాంటి సినిమాలకు వారం పాటు ధరుల పెంచుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. వకీల్ సాబ్ సినిమా వరకూ ఈ సౌకర్యం టాలీవుడ్‌కు ఉంది.
ఇక ఐదో షోను దొంగ షోగా సినిమాటోగ్రఫీ మంత్రి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఐదో షోకి కూడా అనుమతి ఇచ్చారు. ఇది చిన్న సినిమాలకూ వర్తిస్తుందన్నారు. చిన్న సినిమాలకు ఐదో షో కానీ బెనిఫిట్ షోలు కూడా వేసే అవసరం రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. గతంలో ఈ సౌకర్యం టాలీవుడ్‌కు ఉంది. ఇప్పుడు మళ్లీ జగన్ పునరుద్దరిస్తామన్నారు. ఐదో ఆట వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని జగన్ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో టాలీవుడ్ ప్రముఖులకు విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. అక్కడ జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని పిలుపునిచ్చారు. మనందరం అక్కడికి వెళ్తే ఇళ్ల స్థలాలతో పాటు స్టూడియోలకు కూడా స్థలాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. జగన్ స్థలాలు ఇస్తారో లేదో కానీ ఇప్పటికే పాత సౌకర్యాలు మాత్రం టాలీవుడ్ మళ్లీ సంపాదించుకునే విషయంలో కాస్తంత ముందడుగు వేసింది.