ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడల్లా ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తీవ్రంగా కష్టాల్లో ఉన్న ఓ ఫ్యామిలీ ఆయన దగ్గరకు వస్తుంది. తమ కష్టాలను చెప్పుకుంటుంది. వెంటనే జగన్.. కష్టాలను తీరుస్తానని హమీ ఇస్తారు. వినతిపత్రం తీసుకుని సమస్యను పరిష్కరించాలని.. కావాల్సిన సాయం చేయాలని పక్కన ఉన్న అధికారులను ఆదేశిస్తారు. ప్రతీ పర్యటనలో ఇలాంటి సాయం ఒకరికి చేస్తున్నారు. తాజాగా ఆయన సొంత జిల్లా కడపలో ఇలాంటి సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊరికొకరిని ఓదారిస్తూ.. సాయం చేస్తూ.. మంచి కెమెరా యాంగిల్స్ లో ఆ ఎపిసోడ్ ను షూట్ చేసి.. సీఎంవో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
తమ సమస్యను ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని ఆయన పరిష్కరిస్తారని ఎదురుచూసే బాధితులు లక్షల్లో ఉంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రజాదర్భార్ లాంటి కార్యక్రమాలేమీ చేపట్టడం లేదు. స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అందులో వస్తున్న స్పందనపై ప్రజలు సంతృప్తిగా లేరు. అందుకే జగన్ కు చెప్పుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు, వీరిలో ఎక్కువగా సాయాన్ని కోరుతూంటారు. సీఎంఆర్ఎఫ్ సాయం.. వైద్య ఖర్చులు .. ఇతర సాయాలు కోరోవాళ్లు ఉంటారు. ఇ సీఎంఆర్ఎఫ్ సాయం ఈ మధ్య కాలంలో చాలా వరకూ తగ్గించేశారు. దీంతో అలా దరఖాస్తు చేసుకున్న చాలా మంది సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
జగన్ జనాలను కలవడం లేదని విమర్శలు వస్తూండటంతో ప్లాన్ చేసి బాధితుల్ని రప్పిస్తున్నట్లుగా తెలుసతోంది. ముందస్తుగానే ఆ కుటుంబాన్ని ఎంపిక చేసి.. సీఎం జగన్ సభా స్థలికి వెళ్లేటప్పుడో.. వచ్చేటప్పుడో ఆయన దగ్గరకు పంపుతున్నారు. ఆ బాధితులు కలుస్తారని సీఎంకుకూడా ముందుగానే సమాచారం ఉంటుందని తెలుస్తోంది. వెంటనే సీఎం కూడా సమస్యను పరిష్కరించమని ఆదేశాలిస్తారు. సీఎంను సాయం అడిగేందుకు ఆయన ఏ జిల్లాకు వెళ్లినా పెద్ద సంఖ్యలో జనం వస్తూంటారు. అయితే వారు కనీసం కిలోమీటర్ దూరంలోనే ఉండిపోతారు. ఈ బాధితులకు మాత్రం అవకాశం ఉంది. అయితే వీరైనా నిజమైతే బాధితులై నిజంగానే సాయం అందించి ఉంటే…మంచిదే అనుకోవచ్చు. కానీ పబ్లిసీటీ మాత్రమే పొంది.. మిగతాది మర్చిపోతే.. అది పాపం అవుతుంది.