సమస్యలు… కచ్చితంగా ఉన్నాయి. బాధలు… చాలామందికి ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్లు, సవాళ్లు, ఎదుదెబ్బలు… ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిల్లోంచి కొన్నింటికి పరిష్కారాలను ప్రభుత్వాల ద్వారా ప్రజలు ఆశిస్తారు. అంటే, నాయకుల తీరుస్తారని భావిస్తారు. నమ్ముతారు, ఓట్లేసి గెలిపిస్తారు. ఆ సమస్యల్ని ప్రాతిపదికగా చేసుకునే నాయకులు ఎన్నికల్లో హామీలిస్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే… ఆ నాయకుల మాటల్ని మరోసారి ప్రజలు నమ్మరు. ఇది ప్రజల కోణం.
ఇక, నాయకుల విషయానికొస్తే… ప్రజల సమస్యల్ని చూసే విధానం అనేది ఒకటి ఉంటుంది. సమస్యల్లోంచి వ్యక్తిగత రాజకీయ లక్ష్యాల సాధనను చూసుకోవడం ఒక యాంగిల్! అవే సమస్యల్లోంచి.. ప్రజలు కష్టాలను, భావితరాల బతుకుల్ని అంచనా వేసి, ఒక విజన్ తో దీర్ఘ కాల ప్రయోజనాలు ప్రజలకు అందించే విధంగా తమ రాజకీయ లక్ష్యాలను ఏర్పరచుకోవడం మరో యాంగిల్.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయానికొద్దాం! ప్రస్తుతం ఆయన కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో యాత్ర సాగిస్తున్నారు. ఈ సందర్బంగా కొంతమంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తున్నారు. పంటలు కలిసిరావడం లేదనీ, గిట్టుబాటు ధర ఉండటం లేదనీ… ఇంటికొకరు మంచం పట్టేసినా తమకు పట్టించుకోవడం లేదనీ… ఇలా కొన్ని సమస్యలు జగన్ ముందుకొస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి చూపించకుండా తన కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకున్నారు ముఖ్యమంత్రి అని కూడా జగన్ దగ్గర వాపోతున్నారని సాక్షి పత్రికలో రాశారు. ఇది ఇవాళ్లే కొత్తగా రాసినవి కాదు. జగన్ పాదయాత్ర మొదలైన దగ్గర్నుంచీ ప్రజల తరఫున ఈ తరహా వాయిస్ నే ప్రముఖంగా సాక్షి ప్రొజెక్ట్ చేసుకూంటూ వస్తోంది. జగన్ కూడా పాదయాత్ర మొదలైన దగ్గర నుంచీ ఇవే అంశాలను ప్రాతిపదికగా తన ప్రసంగాల్లో విమర్శలు చేసుకూంటూ వెళ్తున్నారు.
ఈ సమస్యల్లోంచి ‘అధికారం దక్కించుకోవాలి’ అనే రాజకీయ అజెండా మాత్రమే జగన్ చూస్తున్నది! అలా ఎలా చెప్పగలరూ… ప్రజల కష్టాలను తీర్చాలనే చిత్తశుద్ధి జగన్ చాలా ఉందీ కనిపించట్లేదా అని ప్రశ్నించొచ్చు! కరెక్టే… కానీ, జగన్ ప్రసంగాలు, సాక్షి రాతల ద్వారా వినిపిస్తున్న ప్రజల వాయిస్ ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి! ప్రజల గురించి జగన్ ఏం చెప్తుంటారు… ‘అన్నా.. చంద్రబాబు వల్ల మోసపోయామన్నా, అన్నా.. చంద్రబాబు వల్లనే కష్టాలుపడుతున్నామన్నా, అన్నా.. టీడీపీ నాలుగేళ్ల పాలనలో మా బతుకులు ఇలా అయిపోయాయన్నా’ ఇలానే కదా చెబుతుంటారు. ప్రజల కష్టాలు కచ్చితంగా అడ్రస్ చేయాల్సివే, వాటిని విమర్శించడం లేదు! కానీ, ‘చంద్రబాబు వల్ల.. టీడీపీ పాలనలో.. గడచిన నాలుగేళ్లుగానే’.. ఇలాంటి విశేషణాల ఆపాదింపుపై మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నది.
ప్రాక్టికల్ గా చూసుకుంటే… ఒక పేదరోగి ఉన్నాడనుకుందాం. వెంటనే చికిత్స చేయించుకోవడం కోసం ఎదురు చూస్తాడు. అంతేగానీ… గడచిన నాలుగేళ్లుగా ఫలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వారి పాలనా నిర్లక్ష్యం కారణంగానే నాకీ పరిస్థితి వచ్చింది కాబట్టి, మరో పార్టీ అధికారంలోకి వస్తేనే తన ఆరోగ్యం మెరుగుపడుతుందన్నంత ఆవేదన ఉంటుందా..? తక్షణం చికిత్స కావాలి.. ఇదే ఆ రోగి డిమాండ్. అంతేగానీ… ఇంత రాజకీయ కోణం ఉంటుందా..? ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరంటేనేది ఆలోచిస్తాడు, అది అప్పటి అంశం అవుతుంది. అంతేగానీ, రోజువారీ జీవితంలో ప్రతీ సమస్యకీ రాజకీయ కోణంలో ఎన్నికల తరువాతే పరిష్కారం అంటూ ఎదురుచూస్తూ కూర్చుంటారా..?
జగన్ ఇస్తున్న హామీల్లో… ప్రజల సమస్యలకు పరిష్కారం అంటే, అదెప్పుడో ఆయన అధికారంలోకి వచ్చాక జరిగే ఒక మార్పు! పోనీ, ఆ మార్పుపైన అయినా స్పష్టమైన విజన్ ను ప్రజలకు వివరించగలుగుతున్నారా అంటే.. అదీ లేదు! గిట్టుబాటు ధరల సమస్యలుగానీ, అనారోగ్య సమస్యలుగానీ, విద్యా సమస్యలుగానీ.. ఇంకోటిగానీ ఇంకోటిగానీ జగన్ అధికారంలోకి వచ్చే వరకూ ఆగాల్సిందేనా..? ఈలోగా జగన్ పరిష్కరించలేరా..? ఇన్ని సమస్యల్ని ప్రజలు ప్రతి నిత్యం పాదయాత్రలో తన దగ్గర ఏకరవుపెడుతూ ఉంటే… అధికారంలోకి గానే చూస్తా చేస్తా అంటూ నడుచుకుని వెళ్లిపోతుంటే… ఆ సమస్యల్లో ఉన్న ప్రజలు ఎన్నికల దాటే వరకూ ఎదురుచూడాలా..? ‘అన్నా సమస్యల’ని ప్రజలు జగన్ దగ్గరకి వస్తుంటే… ఓదార్చి వెళ్లిపోతే సరిపోతుందా..? ప్రజల సమస్యల్ని నాయకులు రెండు కోణాల్లో చూస్తారని ముందుగా చెప్పుకున్నాం! మరి జగన్ ది ఏ కోణమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేముంది..?