రాష్ట్రం కోసం.. ప్రజల కోసం వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నామని.. అయినప్పటికీ.. పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని.. డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయబారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనస్ పాయింట్లు మొత్తం ఆయన తన ప్రసంగంలో నిర్మొహమాటంగా చెప్పుకున్నారు. ఏపీకి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమేనన్నారు. విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తూ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నామని.. పీపీఏలు కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనేది కూడా వివాదాస్పదమేనని.. అయినప్పటికీ.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే తప్పదన్నారు. అలాగే.. ఏపీ నుంచి ఎగుమతి అవుతున్న అక్వా ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఉండటం లేదని కూడా తేల్చేశారు. వాటిని మెరుగుపర్చేందుకు రాయబారుల సాయం కోరారు.
సదస్సు ప్రారంభోపన్యాసలోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రకు ఉన్న ప్లస్ పాయింట్లు కన్నా.. మైనస్ పాయింట్లనే ప్రధానంగా ప్రస్తావించారు. 4 పోర్టులు..ఆరు ఎయిర్‌పోర్టులు, కోస్తా ప్రాంతం మాత్రమే ఏపీకి బలమని వ్యాఖ్యానించారు. అయితే.. వాటిలోనే ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా తన ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్లస్ పాయింట్‌గా చెప్పేందుకు సీఎం ప్రయత్నించారు. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని.. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో మంచి సంబంధాలున్నాయని జగన్ రాయబారులకు వివరించారు. టెండర్ల నుంచి కేటాయింపుల దాకా అవినీతి రహిత నిర్ణయాలు తీసుకున్నామని.. పెట్టుబడిదారులకు ధైర్యం కల్పించే బాధ్యత తమదేనని జగన్ భరోసా ఇచ్చారు.
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం , ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, రిఫైనరీల్లో విదేశీ పెట్టుబడులు రావాలని జగన్ ఆకాంక్షించారు. పరిశ్రమలు, జల నిర్వహణలో పెట్టుబడులు రావాలి … ఎలక్ట్రిక్ బస్సులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పెట్టుబడులు కావాల్సి ఉందన్నారు. ఐదేళ్లలో కొత్తగా మరో 4 ఎయిర్‌పోర్టులు.. విశాఖ, విజయవాడ, గుంటూరులో మెట్రోరైల్ ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సుకు.. హాజరైన యూఎస్ఏ, యూకే, కెనడా, జపాన్, కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా 35 దేశాల హైకమిషనర్లు హాజరయ్యారు. భారత విదేశాంగ శాఖ సమన్వయంతో సదస్సు ఏర్పాటు చేశారు. కొంత మంది రాయబారులతో జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు.