“స్థలం కోర్టులో ఉంది” ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అన్న హెచ్చరికలు ప్రింట్ చేసిన పత్రాలు ఇచ్చి.. ఇక స్తలం మీదే పండగ చేసుకోండి అని ఎవరైనా అంటే… వాళ్లను ఎలా చూడాలి. సీఎం జగన్ ను అలాగే చూడాలి. ఎందుకంటే ఆయనే ఇలా కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను పంచుతున్నానని ప్రింట్ చేసి మరీ పంచబోతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం యాజమాన్య హక్కులు లేని పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం పేదల్ని కేసుల పాలు చేయడమే.
కోర్టు కేసుల్లో ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి ఎలా అనుమతిస్తారు ?
ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదు. పేదలకు ఇచ్చే స్థలాల్లో లక్షలు పోగు చేసుకుని అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోండి అని చెబితే ప్రజలు నమ్మరు. అందుకే కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాతే అమరావతి భూములు పంపిణీ చేస్తే ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయం వినిపస్తోంది. లేకపోతే పేదలు కూడా తమను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పేదల్ని రోడ్డున పడేసినట్లే !
యాబై వేల కుటుంబాలకు అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల్లో సెంటు స్థలాలను కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇలా ఇస్తున్న పట్టాలపై ఒక్క పేద కుటుంబానికి కూడా హక్కు రాదు. రేపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే.. ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు పంపిణీ చేసినా పేదలకు హక్కులు లేకుండా పోతాయి. సీఎం జగన్ పేదలకు సెంటు స్థలాలు ఇవ్వాలనుకుంటే.. అనేక చోట్ల ఇతర స్థలాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవ్వాలనుకోవడం లేదు. అక్కడే అతి పెద్ద కుట్ర ఉంది.
సీఆర్డీఏ ఒప్పందం ఉల్లంఘించాలని ఏ కోర్టు అయినా చెబుతుందా ?
సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ధర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడానికి నిపుణులు అవసరం లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే రైతులకు పూర్తి స్థాయిలో.. నష్టపరిహారాన్ని దాదాపుగా 70 వేల కోట్ల వరకూ చెల్లిస్తే ఆ భూముల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం వద్ద అంత వెసులుబాటు లేదు. ఏ కోర్టులు కూడా భూములు ఇచ్చిన రైతుల్ని మోసం చేయాలని.. నిబంధనలను ఉల్లంఘించాలని చెప్పవు. ఎందుకంటే సీఆర్డీఏ చేసుకుంది డెలవప్మెంట్ అగ్రిమెంట్ మాత్రమే…భూములన్నీ కొనుగోలు చేయలేదు.