వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషిస్తున్నా… తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అటు శ్రీశైలం.. ఇటు సర్వహక్కులూ ఏపీకే ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసుకుంటున్నా.. ఏపీ సర్కార్ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందో.. మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని.. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడటం లేదని మంత్రి వర్గ సహచరులక ముందు వ్యాఖ్యానించారు. అదే సమయంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జగన్ సూచించారు. విద్యుత్ ఉత్పత్తి విషంయలో మరోసారి కృష్ణాబోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించారు. జల వివాదాలపై అవసరమైతే.. ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించారు.
సీఎం జగన్ మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేశారంటూ.. మీడియాకు వైసీపీ వర్గాలే అనధికారికంగా మీడియాకు సమాచారం ఇచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని .. వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ఏపీ ప్రజల్నే చూపించారు సీఎం జగన్. తాను ఏమీ మాట్లాడకపోవడం వల్ల.. అన్నీ భరించడం వల్ల తెలంగాణలోని ఏపీ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారని ఆయన చెప్పుకు రావడం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. తన రాజకీయ అనివార్యతలకు.. ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా పట్టించుకోకపోవడమే కాకుండా… అలా పట్టించుకోకపోవడానికి కూడా ఏపీ ప్రజలే కారణం అన్నట్లుగా వాదించడం ఇప్పుడు.. హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల్ని.. తెలంగాణ సర్కార్ ఎప్పుడూ రాజకీయంగా చూడలేదు. అందుకే.. అక్కడి ప్రజలు రాజకీయంగా టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంతో వివాదం ఏర్పడితే.. ప్రజలపై కక్ష సాధిస్తారని ఏపీ సర్కార్ ఎందుకు అనుకుంటుందో కానీ.. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడతారన్న కారణంగా ఏపీ ప్రయోజనాలకు తెలంగాణ సర్కార్ భంగం కలిగించినా సైలెంట్‌గా ఉండాలన్న ఆలోచనకే జగన్ ఓటేసినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణపై ఎలాంటి సమరభేరీ మోగించేది లేదని.. దానికో కారణం వెతుక్కున్నారని విపక్షాలు విమర్శలు ప్రారంభిస్తున్నాయి.