బందరు రోడ్ లో ఇవాళ్ళ వైకాపా విస్తృత సమావేశం జరుగుతోంది. దానిలో మాట్లాడుతున్న పార్టీ నేతలు చాలా ఆసక్తికరమైన విషయాలు చెపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే జగన్ ముఖ్యమంత్రి అయిపోయే ప్రమాదం ఉందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెపితే, పోలవరం ప్రాజెక్టు ని 2019ఎన్నికలలోగా పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సన్మానం చేస్తారని వైకాపా ఎమ్మెల్సీ పిల్లి సుబాష్ చంద్రబోస్ ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అది ఎప్పటికైనా అసలు పూర్తవుతుందా? అనే అనుమానం కలుగుతోందని పిల్లి సుబాష్ చంద్రబోస్ అన్నారు. దానిని పూర్తి చేయాలనే శ్రద్ధ, పట్టుదల ముఖ్యమంత్రికి లేవు కనుకనే పట్టిసీమని చేపట్టారని, కానీ దాని వలన తెదేపా నేతలకి తప్ప ప్రజలకి ఉపయోగం లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకేలాగ వ్యవహరిస్తున్నాయని అన్నారు. అది ఎట్టి పరిస్థితిలలో కూడా రెండేళ్ళలో పూర్తయ్యే అవకాశమే లేదని తను వ్రాసి ఇవ్వగలనని అన్నారు.
రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపాలో అందరూ కూడా వచ్చే ఐదేళ్ళలో పోలవరం ప్రాజెక్టు నిర్మించి చూపిస్తామని పదేపదే చెప్పేవారు. పోలవరానికి కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని, దాని వలననే నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని తెదేపా నేతలు కొత్త పల్లవి పాడటం మొదలుపెట్టారు. దానికి కేటాయించిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చెప్పడం లేదని, నిధులను పక్కదారి పట్టిస్తోందని రాష్ట్ర భాజపా నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ విధంగా పోలవరం గురించి మాటలతోనే రెండేళ్ళు గడిపేశారు. మిగిలిన మూడేళ్ళు కూడా అలాగే గడిపేయవచ్చు. కనుక చంద్రబాబు నాయుడుని సన్మానించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి దక్కకపోవచ్చు.
పోలవరం ఒక్కటే కాదు. ఇంకా చాంతాడంత పెద్ద జాబితా ఉంది. రెండేళ్ళు పూర్తయినా ఇంతవరకు రాజధాని నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టలేదు. దానికీ సేమ్ రీజన్స్…సేమ్ స్టోరీయే! అవికాక ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రెవెన్యూ లోటు భర్తీ, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, యూనివర్సిటీల స్థాపన, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, వైజాగ్, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ఏర్పాటు వంటి అనేక హామీలు తెదేపా-భాజపాలు అటక మీద దాచి ఉంచాయి. బహుశః వచ్చే ఎన్నికలలో వాటన్నిటినీ బూజు దులిపి క్రిందకి దింపుతాయేమో?