ప్రస్తుతం తెదేపా, భాజాపా ల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ రేపటి ప్రయాణాన్ని, గమ్యాన్ని నిర్దేశించనున్నాయా? ఈ రోజు కాకపోతే రేపైనా ఆ రెండు పార్టీల దోస్తీ కటీఫ్ కాక తప్పదని వైసీపీ భావిస్తోందా? అదే జరిగితే ఏపీ లో ఎదుగుదల లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాజాపాకి, మోడీ కి ఫ్యాన్ గాలి అందించేందుకు, కమలం నీడలో సేద తీరేందుకు మానసికంగా రెడి అయ్యిందా?
ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు ఇప్పుడు మరింత స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తాజాగా సాక్షి ఇంటర్వ్యూలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడిన మాటలు నిదర్శనం గా చెప్తున్నారు.
ఆ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ… భాజాపా తో దోస్తిపై అడిగితే… అదంతా బాబు అండ్ కో ప్రచారం అంటూ కొట్టి పారేశారు. అలాగని భవిష్యత్హు లో భాజాపా తో తమ దోస్తీ ఉండబోదని చెప్పలేదు. పైగా మోడీ తో కలిసి నడుస్తామని స్పష్టంగా చెప్పారు. అయితే ప్రత్యేక హోదా కు అంగీకరిస్తేనే సుమా అంటూ మెలిక పెట్టారు. ఈ విషయం తాను ప్రధానమంత్రి మోడీకే చెప్పానన్నారు.
సో… కాషాయ పార్టీ తో వియ్యానికి జగన్ రెడీగా ఉన్నట్టే భావించవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అదే ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రం అంటే భయపడుతున్నారన్నారు. అందుకే ఇప్పుడే తెగతెంపులు చేసుకోబోరని అంచనా వేశారు. ఎన్నికల కు ఒక మూణ్ణెల్లో, అరు నెలలో ఉండగా అది జరగొచ్చు అన్నారు.
దీనిని బట్టి భాజాపా-తెదేపా ల బంధం తెగిపోవడం ఖాయం అని వైసీపీ ఆశాభావం తో ఉందనేది విశ్లేషకుల అంచనా. దీనిని మరింత ఖాయం చేసేందుకే జగన్ సమయం చూసి తన స్నేహహస్తాన్ని చాచారని, ఇక ఇప్పుడు బంతి మోడీ కోర్టు లో వుందని అంటున్నారు