కుటుంబ పెద్ద ఎలా ఉండాలి ?. కుటుంబం అంతా సమానమే అన్నట్లుగా ఉండాలి. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న కలతల్ని నిజాయితీగా పరిష్కరించాలి. అలా కాకుండా ఒకరిపై వైపు ఉంటే ఆ కుటుంబం చీలికపోవడానికి ఎంతో కాలం పట్టదు. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్న జగన్ రెడ్డికి అది చేతకాలేదు. ఆయన మనస్థత్వమే తాను తన వాళ్లు అనుకోవడం తప్ప.. తన కుటుంబం అనుకునే పరిస్థితి లేదు. అందుకే కుటుంబంలోనే కొందరిపై వివక్ష.. మరికొందరిపై ఆపేక్ష చూపడంతో వైఎస్ కుటుంబం చీలిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పవర్ ఫుల్ ఫ్యామిలీల్లో ఒకటి యెదుగూరి సందింటి కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కుటుంబం అంతా ఏకతాటిపైన ఉండేది.కానీ ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. కుటుంబంలో ఆధిపత్య పోరాటం క్రమంగా పెరిగి పెద్దదయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తో మరితం జఠిలం అయింది. వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై అవినాష్ రెడ్డి వర్గం నిందలు వేస్తూంటే… వాటిని షర్మిల ఖండించడం..సునీతకు అండగా నిలవడం సంచలనంగా మారింది. ఇది ఆరంభం మాత్రమేనని త్వరలో కుటుంబంలోని రెండు వర్గాల మధ్య ప్రత్యక్ష పోరాటం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.
వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఆయన తల్లి విజయలక్ష్మి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. జగన్తో ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. కుటుంబంలోని సగం మంది జగన్ కు దూరమయ్యారు. భార్య భారతి తరపు బంధువులు మాత్రమే జగన్ వైపు ఉన్నారు. మరో వైపు వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్ ఫ్యామిలీలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రారంభమయ్యాయి. ఇవి విబేధాలను మరింత పెంచుతున్నాయి. ఇవి ఏ మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం కానీ.. ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి జగనే కారణం అవుతారన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తోంది.