ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేసింది. ఈ మేరకు శనివారం అర్థరాత్రే రహస్య జీవోను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏబీవీపై ఉన్న ఆరోపణలు అన్నింటినీ ప్రత్యేకంగా ఫైల్ రూపంలో కేంద్రానికి పంపినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్లో ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడాది ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. అంతకు ముందు నుంచే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలపై ఇంకా విచారణ పూర్తి కాలేదు. విషయం సుప్రీంకోర్టులో ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియా ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆయన నివేదిక పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ లోపు ఏపీ సర్కార్ మరో అభియోగం మోపింది. కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఇటీవలే ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా నియమించింది. అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ విచారణలో ఉండగానే.. సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని మేజర్ పెనాల్టీ విధించాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును, అభియోగ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాక… యూపీఎస్సీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులను డిస్మిస్ చేయడం అసాధారణం. పనితీరు బాగోలేని వారికి స్వచ్చంద పదవీ విరమణ ఇస్తున్నారు. అయితే ఏబీవీపై ఆరోపణలు ఉన్నందున వాటిపై విచారణ పూర్తి కాకుండా ఏ నిర్ణయమూ కేంద్రం తీసుకోదు. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ ఎందుకు తొందరపడిందోనని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్గా ఓవెలుగు వెలిగిలిన ఆయనకు వైసీపీ హయాంలో కనీసం పోస్టింగ్ దక్కకపోగా.. చివరికి రిటైరయ్యే ముందు సర్వీస్ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది.