జగన్ రెడ్డి తన పుట్టిన రోజునాడు పిల్లలకు ట్యాబ్స్ పంపిణీ చేసేందుకు చింతపల్లిలో సభ ఏర్పాటు చేసుకుని అది తన వైసీపీ సభ అన్నట్లుగా ప్రసంగం చేశారు. ఎదురుగా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టామన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అడ్డగోలుగా రాజకీయ విమర్శలు చేశారు. అంతా ఎప్పుడూ ఉండే విపక్షాలపై ఏడ్చే ఏడుపే. కాకపోతే.. ఎదురుగా పిల్లలు ఉంటే.. మీ బిడ్డ..మీ బిడ్డ అంటూ ప్రతి పదం ముందు ఆయన చేసిన ప్రసంగం వింటే.. ఎవరికైనా అసహ్యం వేస్తుంది. వెగటు పుడుతుంది. అయనా ఆయన తగ్గలేదు.
ఈ సారి జగన్ రెడ్డి ఏడుపు మోతాపుకు మించి పోయింది. తాను చేస్తున్నానని అది అందరికీ మేలు చేస్తుందని చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అసలు ట్యాబ్ వల్ల ఉపయోగమేంటో చెప్పలేదు. కానీ ప్రతి విద్యార్థికి 33వేల రూపాయల లబ్ది కలుగుతుందట. ఏ లెక్కన చెప్పారో కానీ.. జగన్ రెడ్డి చెప్పిన మాట విని.. ఒక్కో ట్యాబ్ మీద 33 వేలు నొక్కేస్తన్నారని పిల్లలు కూడా అనుమానించాల్సి వచ్చింది. తాను ఇస్తూంటే.. వద్దంటున్నారని.. అడ్డుకుంటున్నారని జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కన్నా అప్పులు తక్కువే చేశానని.. కానీ పది లక్షల కోట్లు అప్పులు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలతో పాటు మీడియాపైనా విమర్శలు గుప్పించారు.
రెండున్నర లక్షల కోట్లు అక్క, చెల్లెమ్మల ఖాతాలో వేశానని చెప్పుకొచ్చారు. ఇవన్నీగత ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నారు. కామెడీ ఏమిటంటే.. తన మేనిఫెస్టోలో 99.5 శాతం పథకాలు అమలు చేశానని నిస్సిగ్గుగా చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోను ఎదురుగా పెడితే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని.. విపక్షాలు ఇప్పటికే తేల్చేశాయి. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.. నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారు.. ఇసుక నుంచి మద్యం వరకు అన్నీ స్కాములే చేశారన్నారు.
రాబోయే రోజుల్లో ఇంకా బురద చల్లుతారని వాటిని నమ్మవద్దని కోరారు. జగన్ రెడ్డి ప్రసంగ తీరు చూస్తున్న వారికి.. ఆయన పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని ఎవరికైనా అర్థమవుతుందని విశ్లేషిస్తున్నారు.