ఐ ప్యాక్ సర్వేలో బాగుంటే టిక్కెట్లు ఇస్తా.. లేకపోతే ఎవరికీ చాన్సివ్వను అని ప్రతి సమీక్షలోనూ జగన్ రెడ్డి చెబుతూంటారు. మొత్తం పద్దెనిమిది మంది వెనుకబడి ఉన్నారని.. వారిని వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడతానని చెప్పారు. అప్పట్నుంచి జగన్ రెడ్డి ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్న ఎమ్మెల్యేలకు దడ ప్రారంభమయింది. వ్యక్తిగత ముఖాముఖి సర్వేలో బాగో లేనే పిలుస్తున్నారా అన్న డౌట్ వస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పది మంది ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పిలుపొస్తోంది .
సోమవారం మంత్రులు బొత్స, జోగి, కొట్టు సత్యనారాయణ, అంబటి, మాజీ మంత్రులు వెల్లంపల్లి, ఆళ్ల నాని, పేర్ని నాని, ఎంపీ గోరంట్ల మాధవ్, తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్ సీఎం జగన్ ను కలిసేందుకు క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. ప్రతి రోజూ మూడు గంటల తర్వాత జగన్ రెడ్డిపూర్తిగా రాజకీయాలు అభ్యర్థుల మీదే దృష్టి పెడుతున్నా రు. అందుకే వీరెవరూ అధికారిక విషయాల మీద కాకుండా… రాజకీయాల కోసమే వచ్చారని అంటున్నారు. ఇలా వచ్చిన వాళ్లు అంతా ఇంటింటికి .. గడప గడపకూ వెళ్లని వాళ్లే కావడంతో.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఉండదనే సంకేతాలను వారికి ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
అభ్యర్థుల కసరత్తు అంశం వైసీపీలో పెద్ద పీటముడిగా మారిపోయింది. ఐ ప్యాక్ సర్వేల ప్రకారం చూస్తే.. బొత్స సత్యనారాయణ వంటి వారికి కూడా టిక్కెట్లు నిరాకరించాలి. కానీ అలాంటి పరిస్థితి ఉండదు. చాలా నియోజకవర్గాల్లో రాజీ పడి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుందని.. చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం.. తమపై వ్యతిరేకత కాదని.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. తమను బలి పశువుల్ని చేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినా కొంత మంది ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.