2019 నుంచి వైసీపీకి రాజకీయంగా సేవలందిస్తోన్న ఐ ప్యాక్ టీమ్ కు జగన్ రెడ్డి పాఠాలు బోధించడం రాజకీయ వర్గాలను ముక్కున వేలేసుకునేలా చేసింది.కొన్నేళ్లుగా ఐ ప్యాక్ డైరక్షన్ లో సాగుతున్న జగన్ రెడ్డి తాతకు దగ్గులు నేర్పినట్లుగా .. ఐ ప్యాక్ కార్యాలయానికి చేరి మనమే మళ్లీ గెలుస్తున్నామని వారితో చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐదేళ్ళుగా వైసీపీ ఏం చేయాలో, ఎన్నికల్లో ఎలాంటి విధానాలను అనుసరించాలో ప్లాన్ చేసి వైసీపీకి సేవలందించింది ఐ ప్యాక్. అందులో కొన్ని వర్కౌట్ అయ్యాయి మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితంపై ఐ ప్యాక్ దగ్గర ఓ నివేదిక ఎలాగూ ఉంటుంది. కానీ, జగన్ మాత్రం ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి మళ్లీ మనమే గెలుస్తున్నామని వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐ ప్యాక్ నివేదికలో వైసీపీ ఓడిపోతుందని తేలడంతోనే వైసీపీ గెలుస్తుందని వారిలో ధైర్యం నింపేందుకే ఈ కామెంట్స్ చేశారా..? లేక మరేదైనా సోర్స్ తో ఈ వ్యాఖ్యలు చేశారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈసారి అధికారం అంతా ఈజీ కాదని వైసీపీలో ఆందోళన కనిపిస్తోన్న వేళ జగన్ రెడ్డి కామెంట్స్ మరీ ఎబ్బెట్టుగా అనిపించాయి. గతంలో కన్నా ఒక సీటు ఎక్కువ గెలుస్తామని వ్యాఖ్యానించడం మరీ సిల్లీగా ఉందనే రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా అది వైసీపీకి అనుకూలంగా చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై వైసీపీ గెలుపోటములపై ఎం చెప్పాలన్న అది ఐ ప్యాకే చెప్పాలి కానీ , జగన్ మాత్రం ఐ ప్యాక్ కే రివర్స్ లో గెలుస్తున్నామని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.