వైసీపీ అధినేత జగన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. నాలుగో తేదీన ఆయన తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా నెల్లూరు వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కానున్నారు. ములాఖత్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో అనుమతి ఇచ్చారు.
ఈవీఎంలను ధ్వంసం చేసి.. మూడు హత్యాయత్నాలు చేసి చాలా రోజుల పాటు అరెస్టు కాకుండా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చివరికి హైకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆయన ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టి వేయడంతో జైలుకు వెళ్లక తప్పలేదు. ఆయనకు రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన సోదరుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పిన్నెల్లిని కాపాడటంలో అధికారులు సక్సెస్ అయ్యారు. కానీ తర్వాత మాత్రం పిన్నెల్లి జైలుకు వెళ్లక తప్పలేదు.
పార్టీ నేత జైలుకు వెళ్తే పరామర్శించడం లేదన్న విమర్శలు వస్తాయన్న కారణంగా జగన్ వెళ్తున్నారు. మాచర్లతో పాటు మరికొన్ని చోట్ల అరాచకం అంతా తాడేపల్లి ప్యాలెస్ సూచనలతోనే జరిగిందని పోలింగ్ తగ్గించడానికి భయభ్రాంతులు సృష్టించే కుట్రతోనే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ .. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించనున్నారు.