తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల లో ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఆలోచింప జేస్తున్నాయి. తక్కువ పదాలతో ఆయన చేస్తున్న పోస్ట్ లు అధికార ప్రభుత్వాన్ని సునిశితంగా విమర్శించేలా సాగుతున్నాయి.
ఇక కేశినేని చేసిన తాజా వ్యాఖ్యలు, “అమరావతిని కూల్చేద్దాం…హైదరాబాద్ ని అభివృద్ది చేద్దాం…”- చర్చనీయాంశంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో నిర్మాణాలని, వాటి వెనుక ఉద్దేశాలను పునఃపరిశీలిస్తామని చెప్పగానే, అమరావతి లో రియల్ ఎస్టేట్ కాస్త మందగించడం, ఇప్పుడు కరకట్ట మీద కట్టడాలు కూల్చి వేస్తుండడం కారణంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు సందేహిస్తూ ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, అమరావతిలో రియల్ ఎస్టేట్ మందగించడం కారణంగా ఆ మేరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో బూమ్ కనిపిస్తోంది. పైగా, కెసిఆర్ ప్రతిపాదనలకు చాలా వరకు జగన్ ఒప్పు కుంటూ ఉండడం కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
ఏది ఏమైనా, సంక్షేమంతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాల్సి ఉంది. అభివృద్ధి లేకుండా సంక్షేమం మీద ఫోకస్ చేస్తే ఖజానా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, తద్వారా వచ్చే ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవలసి ఉంటుంది.