భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే అంత కంటే రాజకీయాల్లో సిగ్గుమాలిన తనం మరొకటి ఉండదేమో. జాతీయ మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో బీజేపీపై విమర్శలు చేయడానికి జగన్ నిరాకరించారు. అంతే కాదు రాహుల్ గాంధీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీ వైపే తాను ఉంటానని సందేశం పంపారు.
గత ఐదేళ్లుగా బీజేపీ వెంటే ఉన్నారు జగన్. పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు మద్దతు పలికారు. సీఎఏ ఎన్నార్సీ బిల్లుకూ మద్దతు పలికారు. ఓటింగ్ అనుకూలంగా వేశారు. కానీ ఏపీకి వచ్చి తాము ఆ బిల్లుకు వ్యతిరేకమని ప్రకటనలు చేశారు. ఇలాంటి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. బీజేపీని ఈ ఐదేళ్లలో ఒక్క సారి ప్రశ్నించలేదు. తాము మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేన కూటమిలో చేరవద్దని జగన్ వెళ్లి ప్రత్యేకంగా మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలకు మొరపెట్టుకున్నారు. కానీ వారెవరూ ఆయన మాటల్ని ఆలకించలేదు.
మూడో సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న జగన్ ఇప్పుడు టీడీపీ కూటమిలో చేరినందున బీజేపీని విమర్శించాలని అనుకోవడం లేదు. విమర్శిస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లోఆయన చంద్రబాబును తప్ప ఎవర్నీ విమర్శించలేరు. అంతగా ఇరుక్కుపోయిన ఆయన… మోదీ ఏపీకి వచ్చి తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో పడిపోయారు. కనీసం పార్టీ నేతలతో కూడా మోడీని విమర్శించలేరు. మోడీ టీడీపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి వారు చెప్పింది చెబుతారని సర్ది చెప్పుకుంటున్నారు. కానీ వైసీపీ నిస్సహాయత దేశం మొత్తానికి తెలిసిపోయింది.