ఇవాళ్ళ బందర్ రోడ్డులో జరిగిన వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకి ఒక రహస్యం చెప్పారు. అయితే అది అందరికీ తెలిసిన రహస్యమే. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ప్రజల మనసులను గెలుచుకోవాలని, అందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరంతరం ప్రజలని కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే విషయం అందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా కనిపెట్టి చెప్పిన రహస్యం. రాజకీయాలలో రాణించేందుకు తాతముత్తాతలు అధికారంలో ఉండనవసరం లేదని, ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి కోసం పనిచేయగలిగితే చాలని జగన్ చెప్పారు. దాని కోసం ‘గడప గడపకి వైకాపా’ అనే కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు. దాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు గురించి 100 ప్రశ్నలతో కూడిన కరపత్రాలను సిద్దం చేస్తున్నామని, వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వాటి ద్వారా ప్రజాభిప్రాయం సేకరించాలని కోరారు. ఎమ్మెల్యేలు కావాలనుకొన్నవారు తదనుగుణంగా తమ భవిష్య కార్యాచరణ రూపొందించుకోవచ్చని అన్నారు.
జగన్ రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణం ఆయన తండ్రి రాజశేఖ రెడ్డేనని తెలుసు. ఆయన ఆకస్మికంగా మృతి చెందినప్పుడు ముఖ్యమంత్రి కావడం తన హక్కని జగన్ భావించారు. అందుకోసం ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కూడా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో పార్టీపై అలిగి బయటకి వచ్చి వేరు కుంపటి పెట్టుకొన్నారు. తను బయటకి వచ్చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చేస్తారని వారి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చానుకొన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చాలా చురుకుగా పావులు కదిపి రోశయ్యని ముఖ్యమంత్రిగా నియమించడంతో జగన్ ఆశ నెరవేరలేదు.
అప్పటి నుంచి ఆ కలని సాకారం చేసుకోవడం కోసం జగన్ చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఓదార్పు యాత్రల పేరుతో ఆయన ప్రజలలోకి వెళ్లి వారి మనసులని గెలుచుకొని తన పార్టీని బలోపేతం చేసుకోగలిగారు. 2014 ఎన్నికలలో విజయం చేతికి అందినట్లే అంది జారిపోయింది. జగన్ ప్రయత్నలోపం ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహం కారణంగా పరాజయం పాలయ్యారు. దానితో జగన్ చాలా నిరాశ చెందినప్పటికీ, తను నమ్మిన సూత్రాన్ని పాటిస్తూ నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాదుతూనే ఉన్నారు. అందుకే 19 ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయినా వైకాపా చెక్కు చెదరలేదు.
అయితే అధికారంలోకి రావడానికి ప్రజల మనసులు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో, కులాల సమీకరణాలు, డబ్బు, ప్రత్యర్ధుల వ్యూహాలను చిత్తూ చేయగల సామార్ధ్యం కూడా అంతే ముఖ్యం. గత ఎన్నికలలో తెదేపా చేతిలో త్రుటిలో ఓడిపోవడమే అందుకు చక్కటి ఉదాహరణ.
అయితే 2019 ఎన్నికలలో తెదేపాకి అంత అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. కారణాలు అందరికీ తెలిసినవే. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని గుర్తించకుండా ప్రభుత్వం తన ధోరణిలో తను సాగిపోతోంది. బహుశః ఆ అసంతృప్తిని, ప్రజాగ్రహాన్ని భాజపాపైకి మళ్ళించి వచ్చే ఎన్నికలలో గట్టేక్కేయవచ్చునని భావిస్తునట్లుంది. కానీ ఒకవేళ తెదేపాతో కలిసి సాగాలని భాజపా అనుకొంటే అప్పుడు ప్రజలకి ఏవిధంగా నచ్చ జెప్పాలనుకొంటోందో ఇప్పుడే ఊహించడం కష్టం.
ఒకవేళ జగన్ ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకోగలిగితే, వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ తెదేపాని ఎదుర్కోవడానికి మంచి ఎన్నికల వ్యూహాలు రచించి, అమలుచేయగల బృందాన్ని జగన్ సిద్దం చేసుకోవలసి ఉంటుంది. అలాకాక ప్రజలు తన మొహం చూసి ఓట్లేసేస్తారనే భ్రమ, అహం, అతిశయం, అతివిశ్వాసం ప్రదర్శించినట్లయితే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. వచ్చే ఎన్నికలలో ఒకవేళ జనసేన కూడా రంగంలోకి దిగితే ప్రజల ఓట్లు చీలిపోయే అవకాశాలే ఎక్కువ. కనుక ఆ పరిస్థితిని ముందే అంచనా వేసుకొని అందుకు తగ్గ వ్యూహాలు వైకాపా సిద్దం చేసుకోవాలి. అప్పుడే విజయం గురించి ఆలోచించవచ్చు.