గన్నవరం నియోజకవర్గంలో అటూ ఇటూ కాని పరిస్థితిని ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీకి తాత్కాలికంగా అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనశ్మాంతి కల్పించారు. దుట్టా, యార్లగడ్డలలతో వంశీకి షేక్ హ్యాండ్ ఇప్పించారు. ముగ్గురూ కలిసి పని చేయాలని సూచించారు. ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా.. వల్లభనేని వంశీనే అభ్యర్థి అవుతారని కూడా హామీ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి.. ఆయనే వైసీపీ ఇన్చార్జ్గా ఉంటారని కూడా స్పష్టం చేశారు. దీంతో .. దుట్టా, యార్లగడ్డ వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వంశీకి.. పార్టీ మారినందుకు కాస్త ఊరట లభించినట్లయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెల్చిన వంశీ.. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. కానీ ఆయనకు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు సహకరించలేదు. వంశీ లాంటి వెధవతో కలిసి పని చేసేది లేదని యార్లగడ్డ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఓ దశలో వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా .. అందు కోసం అనుచరులతో సమావేశమైనట్లుగా ప్రచారం జరిగింది. చివరికి విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ ముగ్గురికి జగన్ సెటిల్మెంట్ చేసేశారు.
యార్లగడ్డ వెంకట్రావుకు డీసీసీబీ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. ఆయన నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని హైకమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు. కానీ యార్లగడ్డ రాజకీయ భవిష్యత్‌ను గన్నవరంలోనే చూసుకుంటున్నారు. ఆయన తన పుట్టినరోజును.. ప్రతీ గ్రామంలో చేయాలనుకున్నారు. తన వర్గానికి ప్రాధాన్యం దక్కేలా చూసుకుంటున్నారు. హైకమాండ్ ఆశీస్సులతోనే దుట్టా, యార్లగడ్డ వంశీపై కాలు దువ్వుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. పైకి ముగ్గురూ కలిసి పని చేయమని చెప్పినా… తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని వంశీ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.