వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. కత్తిపూడిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ…. నాన్నగారి హయాంలో ఈ ప్రాంతంలో పదివేల ఇళ్లు కట్టించారని, కానీ ఇవాళ్ల చంద్రబాబు నాయుడు హయాంలో ఊరికి పదిళ్లయినా కట్టించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు నాన్నగారి హయాంలో దాదాపు పూర్తయ్యాయనీ, చంద్రబాబు హయాంలో గడచిన నాలుగున్న సంవత్సరాల్లో పునాదులు దాటి అడుగు కూడా ముందుకు పోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేసిన ఘనత చంద్రబాబుది అని ఆరోపించారు.
నాన్నగారి హయాంలో ఈ ప్రాంతంలో కాలేజీలు వచ్చాయనీ, చంద్రబాబు నాయుడు వచ్చాక గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన నిర్మాణాలు కూడా పూర్తి కాలేదన్నారు జగన్. రాష్ట్రంలో పాలన అత్యంత దారుణంగా ఉందనీ, ఇచ్చినమాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయారన్నారు. ఆయనకి మద్దతుగా ఎల్లో మీడియా ఉందనీ, సమస్యల్ని వదిలేసి, చంద్రబాబును ఇంద్రుడూ చంద్రుడూ అంటూ మోయడమే పనిగా పెట్టుకుందంటూ విమర్శించారు. ఇక, మిగతా విమర్శలు షరా మామూలే. మట్టి నుంచి గుడి భూముల వరకూ అనే విమర్శ కూడా యథాతథంగా ఉంది!
ఈ ఒక్క సభే కాదు.. జగన్ పాదయాత్రలో దాదాపు ఎక్కువగా వినిపించే మాట ‘నాన్నగారి హయాం’! అయితే, అది కాంగ్రెస్ హయాం అనేది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అది తమ హయామే అని ప్రచారం చేసుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ దిశగా త్వరలో ఏపీలో భారీ ఎత్తున ప్రచారానికి సిద్ధమౌతోందనే కథనాలూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేసుకునే ఆ ప్రచారం వల్ల భారీ ఎత్తున వైకాపాకి నష్టం ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. కానీ, చిన్న స్థాయిలోనైనా ఆ ప్రభావం పడుతుందన్నదీ అంతే వాస్తవం. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకే సమయంలో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి… ఆంధ్రాలో ఆయన హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలుగానీ, కొన్ని పథకాలనుగానీ అమలు చెయ్యగలిగారు. జాతీయ స్థాయిలో వైయస్ కి మద్దతు ఉంది ఆనాడు.
కానీ, వైకాపా ఒక ప్రాంతీయ పార్టీ. భాజపాతో కలిసి వెళ్లి ‘నాన్నగారి హయాం’ తీసుకొస్తారా..? భాజపాపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా అటువైపు చూసే సాహసం జగన్ ఇప్పుడు చెయ్యరు. పోనీ, కాంగ్రెస్ తో జతకట్టి ‘నాన్నగారి హయాం’ తెస్తారా..? కాంగ్రెస్ తో కలిసినా విమర్శ తప్పదు. పోనీ, ఈ టాపిక్ వదిలేసి… జగన్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని మాత్రమే చెప్పగలరా..? అది కూడా సౌండింగ్ కాస్త తేడాగానే వినిపిస్తోంది! సో.. జగన్ ప్రసంగంలో నాన్నగారి హయాం అని వినిపించనప్పుడల్లా చాలామందికి కలిగే అనుమానాలివి! అదెలా సాధ్యమనే ఒక ప్రాథమిక అంచనా దొరకని పరిస్థితి..! మాట తప్పనూ మడమ తిప్పనూ అనే ఫార్ములా వ్యక్తిగత స్వభావానికి సంబంధించింది. కానీ, వైయస్ స్థాయి పాలనకు అదొక్కటే చాలదు కదా. ఢిల్లీ స్థాయిలో ప్రభావవంతమైన శక్తీ యుక్తీ ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రస్తుతం ఏపీ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నా… కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే నాయకత్వమే మరోసారి రాష్ట్రానికి అవసరంగా కనిపిస్తోంది..!