విపక్ష నేత జగన్ వెనక వ్యూహకర్తలు ఎవరు ఉంటున్నారో తెలీదుగానీ… ఎన్నికల ప్రస్థావన లేకుండా ఆయన స్పీచులు ఉండటం లేదు! ఎక్కడికి వెళ్లినా ఎన్నికల మాటలే. కొద్ది రోజులు ఓపిక పట్టిండీ.. ఎన్నికలు వచ్చేస్తాయి… తరువాత వచ్చేది మన ప్రభుత్వమే.. మీ సమస్యలన్నీ తీర్చేస్తా.. దాదాపు ఇదే కంటేంట్ పదేపదే రిపీటెడ్ గా జగన్ మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నిర్వాసితులతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేశారు, అది రోటీన్. ఈ ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు జరుగుతున్నాయనీ, ప్రజలకు అండగా నిలబడుతూ వీటన్నింటినీ తాము సరిచేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు ధైర్యంగా ఉండాలనీ, మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయనీ, ఆ తరువాత తెలుగుదేశం సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోతుందని నిర్వాసితులకు జగన్ భరోసా కల్పించారు.
ప్రతీసారీ ఇలాంటి మాటలతో ఇబ్బంది వస్తోంది. ఆ మధ్య అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా జగన్ ఇలానే మాట్లాడారు. కొన్నాళ్లు ఓపిక పట్టండీ, మన ప్రభుత్వం వచ్చేస్తుందీ, అందరికీ పదేసి లక్షల రూపాయాల నష్టపరిహారం ఇప్పిస్తాం అంటూ జగన్ చెప్పారు. ఇక్కడ ప్రశ్నేంటంటే… సమస్యల్లో ప్రజలని ఓపిక పట్టమంటూ ప్రతిపక్ష నేత చెప్పడమేంటీ..? ‘మా సమస్యలు ఇవీ మహాప్రభో’ అని ప్రజలు మొరపెట్టుకుంటూ ఉంటే.. మరో ఏడాదిన్నర ఆగండీ… ఆర్నెల్లు ఆగండీ.. ఆ తరువాత మేమే అధికారంలోకి వస్తాం అంటూ భరోసా ఇస్తూ పోతుంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు..?
‘మీకు ఎన్ని సమస్యలున్నా సరే.. మేం అధికారంలోకి వస్తే తప్ప ఏం చెయ్యలేం’ అని చెబుతున్నట్టుగానే ప్రజలకు అర్థమౌతుంది కదా. ఎప్పుడో ఎన్నికలు వచ్చే వరకూ ప్రజల సమస్యలు ఆగుతాయా..? అయినా, అన్నింటికీ తెలుగుదేశం సర్కారును బంగాళాఖాతంలోకి పడేయడమే పరిష్కారమా..? ఈలోగా ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన పోరాటాలు చెయ్యరా..? ఇవాళ్ల వంశధార నిర్వాసితులైనా, మొన్నటి అగ్రిగోల్డ్ బాధితులైనా, రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులైనా ఇంకోటైనా మరోటైనా… వీళ్లంతా వైకాపా అధికారంలోకి వచ్చే వరకూ తమ సమస్యలను అలానే భరిస్తూ ఉండాలా..? ప్రతిపక్ష నేత చెబుతున్నది ఇదే అన్నట్టుగా అర్థమౌతోంది! వీరి సమస్యలపై ఇప్పుడు పోరాటం చేయండి. తెలుగుదేశం సర్కారును నిలదీయండి. ముఖ్యమంత్రి స్పందించేంతగా ఉద్యమించండీ. ప్రతిపక్షంగా వైకాపా ప్రస్తుత బాధ్యత ఇదే కదా!
చంద్రబాబు సర్కారును స్పందింపజేసే పోరాటం చేస్తే ఆ ఘనత ప్రతిపక్షానికే దక్కుతుంది కదా. ఆ క్రెడిట్ ని ప్రజలు ఓట్ల రూపంలో ఎప్పుడు ఎన్నికలొస్తే అప్పుడే వైకాపాకి ఇస్తారు కదా. ప్రతిపక్షం సాధించినదాన్ని ప్రజలు మరిచిపోరు కదా. ప్రస్తుతం చేయాల్సింది వదిలేసి.. ఎప్పుడో అధికారంలోకి వచ్చే వరకూ తమ సమస్యల్ని తట్టుకోవాలంటూ జగన్ పదేపదే చెబుతూ ఉండటం సరైన వ్యూహరచన కాదు! ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా జగన్ కల్పిస్తున్న భరోసాను ఈ యాంగిల్ లో ప్రజలు అర్థం చేసుకునే అవకాశం కచ్చితంగా ఉంది. మరి, ఈ యాంగిల్ వైకాపా వ్యూహాకర్తలకు తెలుస్తోందో లేదో…!