ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చరిత్ర అంతా కేసీఆర్ వద్ద ఉందని.. అందుకే చంద్రబాబు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరెత్తడం లేదని .. 2015 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి .. టీడీపీ సర్కార్‌పై విరుచుకుపడేవారు. జల దీక్షలు చేసేవారు. ధర్నాలు చేసేవారు. పత్రికా ప్రకటనలు చేసేవారు.. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్లో విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనేం చేస్తున్నారు..?
చంద్రబాబుకు ఓటుకు నోటు భయం సరే.. ఇప్పుడు ఏ భయంతో జగన్ సైలెంట్..?
చంద్రబాబు హయాంలో ఏపీ – తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల సీన్ ఇప్పుడు మళ్లీ సీన్ రిపీటవుతోంది. తెలంగాణ సర్కార్.. డెడ్ స్టోరేజీ వరకూ నీటిని వాడుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకుంటోంది. ప్రాజెక్టులు కట్టేస్తోంది. కానీ ఏపీ సర్కార్ కానీ.. ముఖ్యమంత్రి జగన్ కానీ నోరెత్తడం లేదు. అప్పుడంటే చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. మరిప్పుడు జగన్‌కు గుండె నిండా ధైర్యం ఉంది.. ఓటుకు నోటు కేసు ఆయనపై లేదు.. మరి ఎందుకు నోరెత్తడం లేదు..?. ఈ ప్రశ్నకు సమాధానంగా ఎవరూ ఊహించని విధంగా.. మంత్రివర్గ సమావేశంలో సమాధానం చెప్పారు జగన్. అదేమిటంటే.. తెలంగాణలో అంధ్రులున్నారని .. వారి రక్షణ కోసమే.. మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు.
అప్పట్లోనూ తెలంగాణలో ఆంధ్రులున్నారుగా..? జగన్‌కు తెలీదా..?
సీఎం జగన్ వాదన ఎలా ఉందంటే.. ఏపీ హక్కుల కోసం పోరాడితే తెలంగాణ ప్రభుత్వం.. అక్కడి ఆంధ్రులను హింసిస్తుందన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ సర్కార్‌పై ఇంత వరకూ అలాంటి ట్రాక్ రికార్డు లేకపోయినా.. జగన్ ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్ వస్తోంది. టీడీపీ హయాంలోనూ ఆంధ్రులున్నారు. కానీ అప్పుడు ప్రభుత్వం న్యాయబద్ధంగా పోరాడింది. కేసులు వేసింది. కాళేశ్వరం సహా.. సీతారామ ప్రాజెక్ట్ వరకూ అన్నింటిపైనా ప్రజాస్వామ్య యుతంగా తన వ్యతిరేకత..నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు కేసులకు భయపడి పోరాడటం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తకుండా ఆంధ్రప్రజల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. వారి కోసం అన్నట్లుగా తన వైపు నుంచి కవర్ డ్రైవ్‌లు ఆడుతున్నారు.
ఏపీ ప్రయోజనాలు కాపాడరు.. వైఎస్ పరువూ నిలబెట్టరు..!
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి అంశంలోనూ ఇలా రివర్స్ షాకులు తినాల్సి వస్తోంది. అప్పట్లో టీడీపీని ఎలా విమర్శించారో.. ఇప్పుడు అవన్నీ తిరిగి తమకే వస్తున్నాయి. కవర్ చేసుకోలేక వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సర్కార్‌ను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసి.. ఆంధ్రుల కోసమేనన్న నాటకాన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాడు చంద్రబాబును విమర్శించి.. ఇప్పుడు జగన్ చేస్తున్నదేమిటని సోషల్ మీడియాలో చర్చ జరగడానికి కారణం అవుతోంది. దీనికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీది.