మూడేళ్లు ఓపిక పట్టండి.. నేను రాగానే మీ ఖాతాల్లో డబ్బులేస్తా… మీకు పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తా అని తనను కలసిన వారికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన ఒక్క సారి కూడా సీఎం కాక ముందు కూడా ఇవే కబుర్లు చెప్పేవారు. సీఎం అయిన తర్వాత ఏం చేశారో అందరూ చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలోకి పోయే సరికి.. ఏడాది.. రెండేళ్లు.. మూడేళ్లు అంటూ కబుర్లు చెబుతూ.. టైం పాస్ చేస్తున్నారు. ఇతరులతో.. బాధలు పడుతున్నారని.. ఫీలయిపోతున్నారని ఓపిక పట్టండని అంటున్నారు. నిజానికి ఓపిక పట్టలేకపోతోంది జగనే.
కళ్లు మూసుకుంటే కాలం కరుగుతుంది కానీ రాత మారదు !
జరిగిపోయిన కాలం చాలా త్వరగా అయిపోయినట్లుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అది కాస్త ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. పదేళ్లు ఆయన ఏమీ చేయలేకపోవడం.. ప్యాలెస్‌లోనే ఉండటంతో.. అర్రె ఐదు సంవత్సారాలు ఇట్టే అయిపోయాయి.. తాను ఏం చేయలేకపోయానని అనుకున్నారు. ఇపుడు టీడీపీ పాలన కూడా అలాగే అయిపోతుందని అనుకుంటున్నారు. ఇప్పటికే తొమ్మిది నెలలు అయిపోయిందని.. ఇంకే ముంది మూడు నెలలు కళ్లు మూసుకుంటే సరిపోతుందని అంటున్నారు. చిన్నపిల్లలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తే.. ఎంతెంతో దూరం.. చాలా చాల దూరం అని చెప్పుకుంటూ వెళ్తారు. కానీ జగన్ కు వారికి ఉన్నంత స్ఫూర్తి కూడా లేదు. కళ్లు మూసుకుని పడుకుంటే చాలనుకుంటున్నారు.
ప్రజల కోసం పని చేయకుండా ఎలా వస్తారు ?
మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలకు తనకే ఓట్లు వేస్తారని ఆయన ఎందుకు అనుకుంటున్నారో.. ఎవర్ని నమ్మించాలనుకుంటున్నారో కానీ ప్రజాస్వామ్యంలో పని చేయని ప్రతిపక్ష నేతను గెలిపించిన సందర్భాలు లేవు. పని చేయని వాళ్లను.. అప్పటికే ఓ సారి తన ఘోరమైన పనితీరును చూయించిన వారిని ఎలా ప్రజలు ఆదరిస్తారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పవారు లేరో.. ప్రజల కోసం పోరాడేందుకు ఆయనకు ఓపిక లేదో కానీ.. ఆయన మాత్రం ..తాను ఇంట్లో పడుకుంటే ప్రజలు గెలిపిస్తారని అనుకుంటున్నారు.
ఎక్కడికి వెళ్లినా కళ్ల ఎదుటే ఐదు సంవత్సరాల నిర్వాకాలు
ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి ఎప్పుడూ పులివెందుల రైతుల గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు చాప కిందకు నీరు వచ్చే సరికి హడావుడికి వచ్చి.. రైతులకు వైసీపీ తరపున కూడా ఎంతో కొంత సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన చేసే సాయం… ఆకాశంలో కనిపించే నక్షత్రం అని అందరికీ తెలుసు. అందుకే ఎవరూ నమ్మలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి మీరు బాధల్లో ఉన్నారు.. మీకు తెలియడం లేదు.. మూడేళ్లలో మనం వస్తాం.. ఓపిక పట్టండి అని చెబుతున్నారు. ఎదుటి వారు పాపం జగన్ కు లేని ఓపికను ఎదుటి వారికి లేదని చెప్పుకుని స్వయంతృప్తి పొందుతున్నారని జాలి పడుతున్నారు.