తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పాసులు తీసుకుని ఏపీలోకి వస్తున్న వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అప్పీల్ చేశారు. ఏపీలోకి ఇప్పుడు ఎవరూ రావొద్దని.. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని..పిలుపునిచ్చారు. పర్యటనల వల్ల విపత్తు ముంచుకొస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బంది పడవద్దన్నారు. వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున జనం.. తెలంగాణలో పాస్లు తీసుకుని ఏపీకి వెళ్తున్నారు. సొంతవాహనాలు ఉన్న వారందరూ… సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు పదిహేడు వేలకుపైగా పాసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే.. కేంద్రం ప్రకటించిన వలస కూలీల విధానం… వేరని.. ఏపీ అధికారులు అంటున్నారు. అందరూ ఒక్క సారే వస్తే వారందర్నీ క్వారంటైన్ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం కష్టమవుతుందని అంటున్నారు. దూర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పర్యాటకులు. కూలీలను మాత్రం ప్రత్యేక రైళ్ల ద్వారా తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని… కేంద్రం ప్రకటించిన కూలీల విధానం వారికి వర్తిస్తుందంటున్నారు. అయితే.. నలభై రోజులుగా.. సొంత ప్రాంతాలకు వెళ్లాలని.. ప్రయత్నిస్తున్న హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రులు మాత్రం.. పోలీసుల పాసులు తీసుకుని ఏపీకి వస్తున్నారు.
గతంలో కూడా.. ఓ సారి సరిహద్దుల వద్ద కొన్ని వేల మంది గుమికూడటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోసారి అదే పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపించడంతో జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రజలకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన వలస కూలీల విషయంలో వైసీపీ నేతలు అధిక ప్రచారం చేసుకున్నారు. ఏపీ వాళ్లు ఎక్కడ ఉన్నా.. జగన్మోహన్ రెడ్డి వారిని సొంత ప్రాంతాలకు చేరే వరకూ అండగా ఉంటారని ప్రచారం చేశారు. ఆంధ్రలోకి అందర్నీ రానిస్తున్నారని.. వారిని గౌవరంగా ఇళ్ల దగ్గర దించుతున్నారన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున వలస కూలీలు.. చిరు ఉద్యోగులు.. హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణజిల్లాల్లో ఉండే వారు సరిహద్దుల వద్దకు చేరుకుంటున్నారు.