నంద్యాల ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారుతోంది. అధికార ప్రతిపక్షాలు రెండూ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతాయనడంలో సందేహం లేదు. అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచీ టీడీపీ, వైకాపాలు ఎత్తులకు పైఎత్తు అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చాయి! టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి వెళ్లిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించేశారు. అఖిల ప్రియ కోరిక మేరకు భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే, వైకాపా కంటే ముందుగా అభ్యర్థిని ఖరారు చేయడం వెనక టీడీపీ అసలు వ్యూహం వేరని, వైకాపాని ఎమోషనల్ గా దెబ్బకొట్టేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారనీ.. కానీ, అది వర్కౌట్ కాలేదని ఇప్పుడు తెలుస్తోంది!
ఇంతకీ, టీడీపీ వేసిన ప్లాన్ ఏంటంటే… నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్నది ఆ పార్టీ వాదన. ఎందుకంటే, భూమా నాగిరెడ్డి టీడీపీలో ఉండగా మరణించారు కాబట్టి… అలాంటి స్థానంలో ఏకగ్రీవం చేయడమే అనాధిగా వస్తున్న ఆనవాయితీ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ, టెక్నికల్ గా నంద్యాల స్థానం వైకాపాది. గతంలో ఆ పార్టీ టిక్కెట్ మీదే భూమా గెలిచారు. సో.. పోటీకి వైకాపా సిద్ధమైంది. అయితే, ఈ తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలుసుకునేందుకు భూమా అఖిల ప్లాన్ చేసుకున్నారట! ఎందుకంటే… తన తండ్రి మరణించిన స్థానంలో పెదనాన్న కుమారుడు పోటీ చేస్తున్నాడనీ, వైకాపాని పోటీకి దిగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలంటూ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి, అఖిల ప్రియ, ఆమె సోదరి మౌనికలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు జగన్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు.
ఎలాగూ ఏకగ్రీవానికి జగన్ ఒప్పుకోరు కదా! ఏకగ్రీవానికి తాము ప్రయత్నించినా జగన్ ఒప్పుకోలేదనీ, అడిగినా కాదన్నారనే ప్రచారం చేసుకోవచ్చన్నది అఖిల ప్రియ వర్గం ప్లాన్. అయితే, ఈ విషయాన్ని ముందుగా పసిగట్టడంతో హుటాహుటిన శిల్పా మోహన్ రెడ్డి పేరును నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా జగన్ ప్రకటించేశారు. భూమా ఫ్యామిలీ తన అపాయింట్మెంట్ కోరే లోపుగానే వైకాపా అభ్యర్థి ప్రకటన జరిగిపోవాలని జగన్ భావించారట! తనను అడిగినా ఏకగ్రీవానికి జగన్ ఒప్పుకోలేదనే ప్రచారానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే శిల్పా ఎంపిక త్వరత్వరగా జరిగిపోయిందని వైకాపా వర్గాలు అంటున్నాయి.
అయితే, అఖిల ప్రియ వర్గం ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే… సవాళ్లు విసరడం! నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ క్రెడిట్ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ కార్యకర్తలకు దక్కుతుందని.. ఒకవేళ ఓటమి చవి చూస్తే దానికి తానే పూర్తి నైతిక బాధ్యత వహిస్తానని ఆమె అంటున్నారు. ఇదే మాట శిల్పా చెప్పగలరా అంటూ సవాలు విసురుతున్నారు. అయితే, ఈ సవాలుపై శిల్పా కాస్త భిన్నంగా స్పందించారు. ఓటమి పాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అఖిల ప్రియ చెబితేనే… ఆమె విసిరిన సవాలును స్వీకరిస్తానని ఆయన అంటున్నారు. మొత్తానికి, నంద్యాల ఉప ఎన్నికలో రెండు ప్రధాన పార్టీలూ ఎత్తులూ పైఎత్తులూ బాగానే వేస్తున్నాయి.