వైసీపీ కార్యకర్తల్లో రెండు రోజులుగా ఒకటే చర్చ..! అదే కలకడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే కార్యకర్త కోవిడ్‌తో చనిపోవడం. ఎవరూ పట్టించుకోకపోవడం.. ఎవరో నలుగురు ఐదుగురు కుటుంబసభ్యులు తప్ప ఎవరూ పట్టించుకోవడం వంటి అంశాలు.. వైసీపీ కార్యకర్తలు.. సోషల్ మీడియా సైనికుల్లో తీవ్రమైన చర్చనీయాంశమయింది. పరిస్థితి సీరియస్‌గా మారుతుందని గమనించిన ముఖ్యమంత్రి జగన్.. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సాయంత్రం హుటాహుటిన స్పందించారు. ఓ సంతాప సందేశం విడుదల చేశారు. కానీ అప్పటికే.. కార్యకర్తల్లో ఓ రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది.
చిత్తూరు జిల్లాకు చెందిన కలకడ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి వైసీపీ వీరాభిమానిగా పేరుంది. ఆయన సోషల్ మీడియాలో శ్యామ్ కలకడగా ప్రసిద్ధుడు. బెంగళూరులో నివాసం ఉంటూ… ఏపీలో రాష్ట్ర స్థాయిలో జగన్ ఎలాంటి కార్యక్రమాలకు పిలిపునిచ్చినా చేసేవాడు. ఐటీ వింగ్‌లో అత్యంత కీలక పాత్ర పోషించాడు. వైసీపీ పార్టీవ్యవహారాల్లో చురుగ్గా ఉండే వారందరికీ… శ్యామ్ కలకడ పరిచయమే. జగన్ పాదయాత్ర చేసినన్ని రోజులు కనీసం నూట ఇరవై మందితో పాల్గొనేవారు. ఆయనకు కొద్ది రోజుల కిందట.. కరోనా సోకింది. బెంగళూరులో పన్నెండు రోజుల పాటు చికిత్స పొంది.. చివరికి చనిపోయారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఒక్క వైసీపీ నేత సాయానికి వెళ్లలేదు. చివరికి అంత్యక్రియలకూ సాయం చేసిన వాళ్లు కూడా లేరు.
ఈ అంశం వైసీపీ క్యాడర్లో తీవ్ర చర్చనీయాంశమయింది. ఉదయం అంతా అంతర్గతంగా చర్చ జరిగినప్పటికీ.. సాయంత్రానికి అందరూ సోషల్ మీడియాకు ఎక్కారు. నేరుగా.. పార్టీ విజయం కోసం కష్టపడిన వారిని కనీసం కాస్త గుర్తు పెట్టుకోవాలని .. ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ప్రాణం పెట్టే కార్యకర్తలే.. నిరాశావాదంతో తమనెవరూ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంతో.. ముఖ్యమంత్రి జగన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లోనే పోస్టులు పెట్టడంతో వైసీపీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే.. .శ్యామ్ కలకడ కుటుంబాన్ని జగన్ పరామర్శించారని ఓ ప్రెస్ నోట్ విడుదలయింది.
శ్యామ్ కలకడ మృతి మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో వైసీపీ రూట్ లెవల్ కార్యకర్తలు అసంతృప్తి గురవుతున్నారు. ప్రభుత్వం వచ్చినా తమకేమీ సాయం అందడం లేదని… బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో శ్యామ్ కలకడ వ్యవహారం హైలెట్ అయింది. ముందు ముందు ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలని వైసీపీలోనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు..!