కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. కాపులకు రిజర్వేషన్లు అనేది తన చేతుల్లో లేని విషయం కాబట్టి… తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని నేరుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల అంశం.. ఓ రాజకీయ వివాదంగా మారిన తర్వాత జనగ్మోహన్ రెడ్డి.. నేరుగా తన అభిప్రాయాన్ని మొదటి సారి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలో కొంత మంది యువకులు.. కాపు రిజర్వేషన్లపై వైఖరి స్పష్టం చేయాలంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో జగన్ స్పందించక తప్పలేదు. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పినందున.. కాపు రిజర్వేషన్ల హామీని ఇవ్వలేనన్న జగన్.. కాపు కార్పొరేషన్ కు మాత్రం..చంద్రబాబు ఇచ్చే నిధుల కంటే రెట్టింపు ఇస్తానని ప్రకటించారు.
కాపు రిజర్వేషన్లపై జగన్ ప్రకటన పూర్తిగా పలాయనవాదనమని ఆ పార్టీ కాపు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని. అందరికీ తెలుసని.. అసలు ఆ అంశానికి మద్దతు ఇస్తున్నారో లేదో చెప్పకుండా.. తప్పించుకోవడమేమిటని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ నైన్ లో పెడితే పనైపోతుంది. ఆ విషయంలోనూ జగన్ ఎలాంటి వైఖరి చెప్పలేదు. కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు. అలాగే చేస్తానని కూడా చెప్పలేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాననంటున్న జగన్.. కాపు రిజర్వేషన్లకు హామీ ఇచ్చి ఉండాల్సిందని వైసీపీ నేతలు అంటున్నారు.
కాపు రిజర్వేషన్లపై జగన్ తప్పించుకున్న వైనం… కాపు సామాజికవర్గ నేతలను కూడా నివ్వెర పరిచింది. నిజానికి కాపు రిజర్వేషన్ల అంశంపై… వైసీపీలోని కాపు నేతలు చాలా దూకుడుగా ప్రకటనలు చేశారు. ముద్రగడ పద్మనాభం.. ఉద్యమం చేయడం వెనుక వైసీపీ నేతలు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రక్రియ అంతా పూర్తి చేసినా.. తాము అనుకలమేనని.. కేంద్రంపై ఒత్తిడి తెస్తాననే ప్రకటన చేయడానికి కూడా జగన్ కు మనసు రాలేదని కాపు నేతలు అసంతృప్తిలో ఉన్నారు.