వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించబోతున్నారు. జిల్లాలో తాడిపత్రి, కదిరి నియోజక వర్గాలలో పర్యటించి, ఆ ప్రాంతాలలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు ఆర్ధిక సమస్యల కారణంగా బలవన్మరణాలకు పాల్పడ్డారని వైకాపా చెపుతోంది. పంట రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి రైతులను, చేనేత కార్మికులను మోసం చేయడం వలననే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైకాపా వాదన. దానిని తెదేపా ఖండిస్తోంది. కానీ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఆ విషయం జగన్మోహన్ రెడ్డి భరోసా యాత్రలు చేపట్టినప్పుడే హైలైట్ అవుతుంటుంది.
జగన్ ఇప్పటికే నాలుగుసార్లు జిల్లాలో పర్యటించి ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈరోజు రైతు భరోసా యాత్రతో మరోసారి ఆ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఇది తెదేపా ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలిగించే విషయమే కనుక తెదేపా నేతలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శించడం మొదలుపెట్టడం ఖాయం. కానీ సున్నితమైన ఈ సమస్యపై ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకుండా, ఆ సమస్యను ఎత్తి చూపిస్తున్న జగన్ పై విమర్శలు చేయడం వలన ప్రజలు కూడా అసంతృప్తి చెందవచ్చునని తెదేపా నేతలు గుర్తిస్తే మంచిది.
రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న లెక్కలు నిజమనుకొంటే అది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఒక్క అనంతపురం జిల్లాలోనే అంత మంది ఆత్మహత్యలు చేసుకొంటున్న మాట వాస్తవమైతే, మిగిలిన రాయలసీమ జిల్లాలలో ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారో? అనే సందేహం కలుగక మానదు. ఇటువంటి సమస్యల వలన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, వచ్చే ఎన్నికలలో తెదేపాపై ఈ ప్రభావం తప్పకుండ పడే అవకాశం ఉంటుందని గ్రహించి మేల్కొంటే మంచిది.