బడ్జెట్ను ఆమోదించేందుకు నిర్వహించిన కేబినెట్ భేటీ కొంత మంది మంత్రులకు చివరి మీటింగ్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని సీఎం జగనే వారికి చెప్పేశారు. వచ్చే కేబినెట్ సమావేశానికి అందరూ ఉండరని.. కొంత మందే వస్తారని క్లారిటీ ఇచ్చారు. అయితే మంత్రి పదవులు లేకపోతే డిమోషన్ అనుకోవద్దని జగన్ సూచించారు. కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత… అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం కూడా పూర్తయిన కేబినెట్లో మంత్రివర్గ విస్తరణ అంశంపై జరిపిన చర్చ వివరాలను వైఎస్ఆర్సీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి.
చాలా మంది మంత్రి పదవుల ఆశావహులు ఉన్నారని… వారికి న్యాయం చేయాల్సి ఉందని జగన్ సహచర మంత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉద్వాసనకు గురయ్యే కొంత మంది మంత్రులను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తామన్నారు. పార్టీ కోసం ప్రస్తుతం ఉన్న మంత్రులు పని చేయాలని..పార్టీని గెలిపించుకుని వస్తే మళ్లీ మీరే మంత్రులు కావొచ్చునని జగన్ వారికి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ వంద శాతం మంత్రుల్ని మార్చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. కొంత మంది మంత్రుల్ని కొనసాగించబోతున్నారు. ఇప్పుడు ఆ అదృష్టవంతులెవరన్న దానిపై వైఎస్ఆర్సీలో చర్చ జరుగుతోంది వివాదాల పాలైన మంత్రులు.. అలాగే పనితీరు బాగోలేని మంత్రులను తొలగించే అవకాశం ఉంది. విపక్షాలపై మూకుమ్మడిగా విరుచుకుపడుతూ.. తనపై అత్యంత విధేయత చూపిస్తున్న వారిని జగన్ పక్కన పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాలో పాలన.. కొత్త మంత్రులతో ఉంటుందని… ఆ మేరకు మంత్రుల్ని మానసికంగా రెడీ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.