లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే సస్పెండ్ చేస్తారు..!
ఏసీబీ దాడుల్లో అక్రమాస్తులు బయట పడితే సస్పెండ్ చేస్తారు..!
పనుల్లో అవకతవకలు చేసినట్లు తేలితే సస్పెండ్ చేస్తారు..!
కానీ… ఏపీ సర్కార్ ..,అలాంటివేమీ లేకుండానే జాస్తి కృష్ణకిషోర్ అనే ఉన్నతాదికారిని సస్పెండ్ చేసింది. పైగా.. ఆ అధికారి ఏపీ క్యాడర్ కాదు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగి. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయో లేవో ప్రభుత్వం చెప్పలేదు. గతంలో ఆయన విధులు నిర్వహించిన శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసి.. ఏసీబీ, సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు చూసి.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈ జాస్తి కృష్ణకిషోర్ అనే అధికారి… వేల కోట్లు ఖర్చు పెట్టిన శాఖలో పని చేయలేదు. పారిశ్రామికవేత్తలు – ఏపీ సర్కార్‌కు మధ్య అనుసంధానంగా వ్యవహరించే వ్యవస్థకు అధిపతిగా పని చేసినా… సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్. జాస్తి కృష్ణకిషోర్ విధులు నిర్వహించిన రాష్ట్ర ఆర్థికాభివృద్ది సంస్థ… ఈడీబీ ..వార్షిక బడ్జెట్ రూ. 30 కోట్లు కూడా ఉండదు. ఈ సంస్థ ఎవరికీ భూములు కేటాయించదు. కేవలం పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుంది.
అవినీతి జరగడానికి అవకాశమే లేని చోట పరిశ్రమల శాఖ నుంచి నివేదిక వచ్చిందంటూ.. అధికారిని సస్పెండ్ చేసి.. ఏసీపీ, సీఐడీ విచారణకు ఆదేశించిన సర్కార్… అసలు కోణం కక్షేనంటున్నారు. ఎందుకంటే.. ఈ జాస్తి కృష్ణకిషోర్.. ఒకప్పుడు ఐటీ అధికారి. ఆయన .. జగతి పబ్లికేషన్స్ .. దొంగ లెక్కలను.. తేలిగ్గా పట్టేసుకున్నారు. ఆదాయపు పన్ను కట్టాలని ఆదేశించారు. ఇప్పుడు అది.. జగన్ గుర్తు పెట్టుకుని తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి… ఇలా కసి తీర్చుకున్నారంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. కేంద్ర కేడర్ సర్వీస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాదు.. ఆరు నెలలు అమరావతి దాటకూడదని.. మరొకటని ఆంక్షలు పెట్టింది. అసలు చేసిన తప్పేమిటో తెలియకుండానే.. విచారణకు ఆదేశించడమే కాదు.. బెయిల్ షరతుల్లా.. ఆంక్షలు విధించారు.
జాస్తి కృష్ణకిషోర్ విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరించిన తీరు.. ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. కక్ష సాధింపుల్లో ఇది పీక్స్ అనుకుంటున్నారు ఉన్నతాధికారులు. రాజకీయ నేతల వ్యక్తిగత కక్షల కోసం.. తమను ఉపయోగించుకుని తమ కొలిగ్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం.. ఇప్పుడు.. పొలిటికల్ హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోంది.