ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నారు కానీ… అధికార యంత్రాంగం.. వ్యవస్థ మాత్రం పెద్దగా సహకరించడం లేదు. ఏడాదిన్నరగా రేషన్ డోర్ డెలివరీ అని అదే పనిగా ముహుర్తాలు పెడుతున్నా.. పదే పదే వాయిదాలు వేస్తూ పోయారు. కొత్త ఏడాదిలో కన్ఫర్మ్ అని అన్నారు కానీ.. అదీ వాయిదా పడింది. ఈ సారి ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి అని చెబుతున్నారు. మొదటగా గోతాల్లో నీట్ గా ప్యాక్ చేయించి.. ఇంటిదగ్గరే వాలంటీర్లు ఇస్తారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. కానీ వాలంటీర్ల వల్ల కాలేదు. గోతాల ఖర్చు తడిసి మోపెడవుతోంది.
అందుకే.. రూటు మార్చి.. గోతాలు ఒక్క సారే ఇచ్చి… బియ్యం మాత్రం ఇంటికి తెచ్చి ఆ గోతాల్లో పోసే విధానాన్ని పెట్టాలని నిర్ణయించారు. మరి ఎలా ఆ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్తారు..? ఎలా కొలిచి పోస్తారో.. ఆలోచించి చివరికి కొత్త వెహికల్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనేక రకాల డిజైన్లు చూసిన తర్వాత చివరికి మామూలు టాటా ఎస్ తరహా వాహనాన్నిఖరారు చేశారు. వాటికి స్టికర్లు వేయించి.. ఏపీకి తీసుకు వచ్చారు. కానీ.. బాలారిష్టాలు మాత్రం తొలగలేదు. ఎలా పంపిణీ చేయాలన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. వాలంటీర్లు పంపిణీ చేయాలా.. లేక వాహనాల డ్రైవర్లు పంపిణీ చేయాలా అన్నదానిపై క్లారిటీలేదు. చివరికి వాలంటీర్లు దగ్గర ఉండి.. వాహనాల డ్రైవర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
మామూలుగా అయితే.. అనేక రకాల సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో ఒక నెల వాయిదా వేసి.. ముందుగా …కసరత్తు చేయాలని నిర్ణయించారు. పైగా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. అందుకే వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇంటింటికి పంపిణీ చేసే బియ్యం.. సన్నబియ్యమా.. లేక నాణ్యమైన బియ్యమా.. లేకపోతే.. ఎప్పుడూ ఇచ్చే బియ్యమేనా అన్నదానిపై స్పష్టత లేకుండా లేదు. నాణ్యమైన బియ్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ నాణ్యమైన బియ్యం అంటే.. పంపిణీ చేసేదే అనుకోవాలని శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ సమయంలో విమర్శలు వచ్చాయి.