ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇప్పుడిప్పుడే జిల్లాల పర్యటనలకు వస్తున్నారు. తాను చేయగలిగింది మీటలు నొక్కడం కాబట్టి ఆయన ఆ పని చేయడానికే బయటకు వస్తున్నారు. ఇలా వచ్చేందుకు భారీ హంగామా ఖర్చు.. బహిరంగసభలు కూడా. అయితే ఇంతా చేసి ఆయన ఏమైనా చెబుతున్నారా అంటే… స్పీచ్ ఎప్పుడూ ఒక్కలానే ఉంటోంది. అందులో మార్పు ఉండటం. ఏ పథకానికి అయితే మీట నొక్కుతున్నారో ఆ పథకం గురించి ముందు చెబుతారు.. తర్వాత మిగతా పథకాల గురించి ఏకరవు పెడతారు. తన పాలన గురించి తాను పొగుడుకుంటారు. మానవత్వమంటే తాను చూపించేదనని సర్టిఫై చేసుకుంటారు.
అంతా అయిపోయిన తరవాత ఇక దత్తపుత్రుడు, దుష్ట చదుష్టయం అని ఎత్తుకుంటారు. అదో నాలుగైదు నిమిషాలు సాగుతుంది. ఇదంతా సొంతంగా చెబుతారా అంటే అదీ లేదు. చూసే చెబుతారు. కూడా.. అనే పదాన్ని కూడా చూసి చెబుతారు దీంతో వినే వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇవన్నీ మొదటి సారి చెప్పినప్పుడు బాగానే ఉన్నాయి. కానీ పదే పదే అదే చెబుతూండటంతో వినేవారికి ఆసక్తి తగ్గిపోయింది. మీడియా సంస్థలు కూడా కవరేజీని తగ్గించేస్తున్నాయి. ఎప్పుడూ చెప్పదే కదా అనుకుంటున్నారు.
ఆయన ప్రసంగం రాసేవాళ్లు ఎవరో కానీ బాగా షార్ట్ కట్ కు అలవాటు పడిపోయారు. అటూ ఇటూ మార్చి ఇచ్చేస్తున్నారు. రివ్యూలు చేసినా ఆయన అదే చెబుతారు. బహిరంగసభల్లో ప్రసంగించినా అదే చెబుతున్నారు. కొన్ని కొన్ని సార్లు కొన్ని పచ్చి అబద్దాలు కూడా అనర్ఘళంగా చెబుతూ ఉంటారు. హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు తాను పదకొండు రోజులు వైజాగ్‌లో ఉన్నానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. అదేమంటే ప్రభుత్వ యంత్రాంగం నా చేతుల్లో ఉండదు కదా అని అప్పట్లో ఆయన చెప్పిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి.
ఏ విపత్తులోనూ ఆయన నేరుగా ప్రజలకు భరోసా ఇచ్చింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా అదే తంతు. కానీ ఇచ్చామని చెప్పుకోవడానికి.. గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పడానికి ఆయన ఏ మాత్రం సంకోచించరు. ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు చెబితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని తెలిసినా తగ్గడం లేదు. అందుకే చాలా మంది ఆయన మైండ్ సెట్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అది వ్యూహం అని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ఈ వ్యూహం పాతబడిపోయిందని వారు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి.