రాజకీయాలలో ఉన్నవాళ్ళు ఒక్కోసారి మాట్లాడే మాటలు ప్రజలకి చాలా వినోదం కలిగిస్తుంటాయి. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం పట్టణంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ అన్న మాటలు అటువంటివే. ఆయన ఏమన్నారంటే “సాధారణంగా సినిమాలలో 14 రీళ్ళు ఉంటే దానిలో మొదటి 13 రీళ్ళలో విలన్ దే పైచెయ్యిగా కనబడుతుంది. ఆఖరి రీలులో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. హీరోది పై చెయ్యి అవుతుంది. విలన్ జైలుకి పోతాడు. మన రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూస్తే అటువంటి విలన్ పాత్ర గుర్తుకు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఏమేమీ చేయకూడదో అవన్నీ చేస్తుంటాడు. ప్రజలని మోసం చేస్తుంటాడు. అవినీతికి, అక్రమాలకి పాల్పడుతుంటాడు. ప్రజలని దోచుకొంటుంటాడు.. ఎమ్మెల్యేలని కొంటుంటాడు…ఇలాగ చాలా తప్పుడు పనులు చేస్తుంటాడు. కానీ చివరికి సినిమాలోలాగే హీరో చేతిలో ఓడిపోక తప్పదు,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి తను ఏమనుకొంటున్నారో అదే ప్రజలు కూడా అనుకొంతున్నట్లు భావిస్తూ చాలా చక్కగానే చెప్పారు. చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే అనుకొంటున్నారనే సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ పట్ల విలన్ లాగ ప్రవర్తిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరిలో ఎవరు హీరో, ఎవరు విలన్ అని తేల్చాలంటే 14వ రీల్ అంటే 2019 ఎన్నికలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. అంతవరకు ఎవరికి వారు తామే హీరోలుగా భావించుకొంటూ, ఎదుటవారే విలన్ అని నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. అంతవరకు ప్రజలు అందరికీ చప్పట్లు కొడుతూనే ఉంటారు.