జయహో బీసీ పేరుతో అన్ని జిల్లాల నుంచి జనాలను సమీకరించి విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఇందిరాంధీ స్టేడియం కెపాసిటీ పది వేలు కూడా ఉండదు. అంత చిన్న గ్రౌండ్లో పెట్టి ఎనభై వేల మంది వచ్చారని చెప్పుకున్నారు కానీ.. మొత్తంగా పదిహేను వేల మంది వరకూ తరలించారు. వారినుద్దేశించే బీసీ పెద్దలంతా ప్రసంగించారు. అయితే ఎవరూ కూడా బీసీలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పులేదు. ప్రసంగించిన వారంతా.. చంద్రబాబు బీసీలను మోసం చేశారు.. జగన్ న్యాయం చేశారని చెప్పడమే కానీ.. మా కులం వారికి మేము ఇంత మేలు చేశామని ఒక్క బీసీ నేత కూడా లెక్కలు చెప్పలేకపోయారు.
సీఎం జగన్ కూడా రొటీన్ క్యాసెట్ మరోసారి వినిపించారు. బీసీలకు ఏం చేశారో చెప్పాల్సిన సభలో.. ప్రజలకు మూడు లక్షల కోట్లకుపైగా ట్రాన్స్ ఫర్ చేశామని.. అందులే 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకేనని మొత్తం జనరలైజ్ చేశారు. ఇక ప్రసంగంలో చంద్రబాబు జపమే ఎక్కువగా కనిపించింది. చంద్రబాబు రాజ్యసభ పదవులు ఇవ్వలేదు..మేమిచ్చాం అని గొప్పగా చెప్పుకున్నారు.కానీ అటు వైపు టీడీపీ వాళ్లు.. టీటీడీ చైర్మన్ దగ్గర్నుంచి యూనివర్శిటీల వైస్ చాన్సలర్ల వరకూ ఎలా బీసీల పదవులను కొట్టేసి రెడ్లకు ఇచ్చారో ప్రచారం చేశారు. చంద్రబాబును నమ్మోద్దని అదేపనిగా జగన్ వేడుకున్నారు. అన్ని ఇళ్లకు వెళ్లి బీసీలకు ఏం మేలు చేశామో చెప్పాలని పార్టీ నేతలను ఆదేశించారు.
అందరికీ ఇచ్చే పథకాలు తప్ప..బీసీలకు చేస్తున్న మేలేం లేదని వైసీపీ ఈ సభతో అంగీకరించినట్లయింది. ఎక్కడా తాము ఫలానా బీసీ కుటుంబానికి మేలు చేశామని చెప్పలేకపోయారు. పైగా బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు.. ఇతర కుల వృత్తుల సామాగ్రి కాదంటూ.. జగన్ కాస్త వెటకారంగా మాట్లాడారు. కులవృత్తులు చేసుకునేవారికి గత ప్రభుత్వం సబ్సిడీతో పరికరాలు ఇచ్చేది. దీన్నేఆయన వెటకారం చేశారు. పథకాన్ని ఆపేసి.. అవి ఇవ్వడం తప్పన్నట్లుగా మాట్లాడారు. అదే సమయంలో బీసీల స్వయం ఉపాధికి ఏం చేస్తున్నారో ఒక్క మాట చెప్పలేదు.
కానీ సభలో చంద్రబాబును తిట్టడంతో పాటు చాలా మంది జగన్ ను వేనోళ్ల పొగడటానికి ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణకు చెందిన కృష్ణయ్య అయితే.. జగన్ ను సంఘ సంస్కర్త అనేశారు. మాజీ మంత్రి అనిల్.. కవితలు రాసుకొచ్చి పొగిడారు. చంద్రబాబును తిట్టారు. బీసీ సభనే కాదు ఏ సభ పెట్టినా చంద్రబాబును తిట్టడమే అన్నట్లుగా నడిచిపోతోంది. ఇది కూడా అంతే.