కేంద్ర ప్రభుత్వం భారతరత్న, పద్మ పురస్కారాలను ఇస్తోందని అలాంటివే తాము ఇవ్వాలనే సంకల్పంతో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. రెండు నెలల కిందట ప్రకటించిన అవార్డులను ఈ రోజు ప్రధానం చేశారు. అవార్డులు గెల్చుకున్న వారికి రూ.10 లక్షలు ఇస్తామని …రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందని సీఎం ప్రకటించారు.
సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామని.. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామని సీఎం తెలిపారు. వైఎస్ఆర్ అని ఓ నాయకుడి పేరు పెట్టి కుల, మతాలకు అతీతంగా ఇస్తున్నామని జగన్ చెప్పడమే కాస్త ఆశ్చర్యరకంగా ఉంటే ఈ అవార్డుల్ని దేశ అత్యున్నత పురస్కారాలయిన భారతరత్న, పద్మలతో పోల్చడం మరింతగా ప్రజల్ని ఆశ్చర్య పరిచింది. పైగా అవార్డుగా ఇచ్చేది వైఎస్ఆర్ విగ్రహాన్నే.
ఈ అవార్డుల్ని ప్రకటించిన తర్వాత పాలగుమ్మి సాయినాథ్ వంటి వారు తమకు ఈ అవార్డు వద్దని తిరస్కరించారు కూడా. అయనప్పటికీ ఇవి అత్యున్నత పురస్కారాలని చెప్పడం చాలా మందిని ఆశ్చర్య పరిచేదే. ఈ అవార్డుల వేడుకలకు సీఎం జగన్ తల్లి విజయమ్మ హాజరయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత ఏ అధికారిక కార్యక్రమంలోనూ కనిపించని తల్లి విజయలక్ష్మికి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో చోటు దక్కింది.