ఏదైనా చేస్తామా లేదా అన్నది తర్వాత సంగతి చేసిన దాని కన్నా.. పది రెట్లు ఎక్కువగా ప్రచారం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి సర్కార్ పాలసీ. అందుకే ఐదు కోట్ల రూపాయల పథకాల సొమ్ములు బటన్ నొక్కడానికి పాతిక కోట్ల రూపాయలు పెట్టి ప్రకటన ఇస్తారు. ఒక్క సారి కాదు. ఒక్క పథకానికి పది సార్లు బటన్ నొక్కితే.. పది సార్లూ ప్రకటన ఇస్తారు. ఇలాంటి పబ్లిసిటీ పిచ్చి ప్రభుత్వం .. అనుకున్న ప్రచారం రాదని భావిస్తే దేన్నైనా ఆపేస్తుంది. దానికి సాక్ష్యం కులగణన. ఏపీలో కులగణన చేపడుతున్నామని చరిత్ర సృష్టిస్తన్నామని కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు.
ప్రాంతీయ సమావేశాలు పెట్టారు. కానీ ఇవన్నీ వైసీపీ సమావేశాల్లా ఉండటంతో ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు.కానీ దేశవ్యాప్తంగా కలగణనపై జరుగుతున్న రాజకీయం చూసి.. తాము కూడా చలి కాచుకునేందుకు వైసీపీ రంగంలోకి దిగింది. తేదీలను ప్రకటించింది. ప్రత్యేకంగా యాప్ సిద్ధం చేసి వాలంటీర్లతో డౌన్ లోడ్ చేయించింది. వారంలో పూర్తి చేయాలనుకుంది. కానీ హఠాత్తుగా ఆపేయామని ఆదేశాలిచ్చింది. ఎందుకంటే కులగణన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు హైప్ రావడం లేదు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తే వై ఏపీ నీడ్స్ జగన్ ఆపేయాల్సి ఉంటుంది. యాభై కోట్లు ప్రజాధనం పెట్టి టోపీలు, టీషర్టులు కొని నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు కూడా వెనక్కి పోతాయి. పబ్లిసిటీ రాదు. అందుకే కులగణన వాయిదా వేశారు.
మళ్లీ డిసెంబర్ పదో తేదీ నుంచి నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకు ముందు దీన్నో వివాదాస్పద అంశంగానో.. ఓట్ల రాజకీయంగానో చేసుకునేందుకు కులగణన ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వైసీపీకి రివర్స్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా వినిపించడంతో వైసీపీ జాగ్రత్త పడుతున్నట్లుగా చెబుతున్నారు.