ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని.. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇతర రాష్ట్రాల మాదిరిగా నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు కానీ.. ఇతర రాష్ట్రాల మాదిరిగా… టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోలేదు. విద్యాపరంగా విద్యార్థులకు నష్టం జరగొద్దనే నిర్ణయం తీసుకున్నామని.. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే.. సీఎం జగన్ ఇంత పట్టుదలగా ఉండటానికి విపక్షాలు చేస్తున్న రాజకీయంగానే కొంత మంది వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలంటూ లోకేష్.. ఆన్ లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడిస్తున్నారు. సోషల్ మీడియాలో క్యాంపైన్ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అనేది సాధ్యం కాదనేది నిపుణుల వాదన. అందుకే సీబీఎస్ఈ సహా అన్ని రాష్ట్రాలు… టెన్త్ పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కాకపోతే..రేపైనా పరీక్షలను వాయిదా వేయక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల్లోనూ అదే అభిప్రాయం ఉంది. అయితే తొందరపాటెందుకని… ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం పరీక్షలను రద్దు చేయడం ఖాయమని.. అది తమ డిమాండ్ వల్లే అని చెప్పుకోవడానికి.. విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అనుమానిస్తున్న ప్రభుత్వం .. ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
కరోనా గత ఏడాది కంటే ప్రమాదకరమైన పరిస్థితిలోకి దేశాన్ని నెట్టేసింది. రాష్ట్రాలన్ని లాక్ డౌన్లు.. కర్ఫ్యూల బాట పట్టాయి. నేటి బాలలే రేపటి పౌరులని.. వారిని కాపాడుకోవడమే లక్ష్యంగా… ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజకీయపార్టీలు కోరుతున్నాయి. సీబీఎస్ఈ సహా.. దాదాపుగా అన్ని రాష్ట్రాలు .. పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాయి. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ కూడా అదే చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ తరహా పరీక్షలూ జరగడం లేదు. ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో పట్టుదలతో ఉంది.